రేపు కలిదిండికి రానున్న ముఖ్యమంత్రి

  • మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో పట్టాదారు పాస్‌బుక్కుల పంపిణీ
  • ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పార్థసారథి

కలిదిండి, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు కలిదిండి మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు పర్యటన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి పాల్గొనే ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పార్థసారథి పరిశీలించారు. కార్యక్రమం జరిగే ప్రాంతాన్ని సందర్శించి హెలిప్యాడ్‌, ప్రజావేదిక, సభా ప్రాంగణం, క్యాడర్‌ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లన్నింటినీ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

కలిదిండి మండలంలో నిర్వహించనున్న ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా పట్టాదారు పాస్‌బుక్కుల పంపిణీ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై లబ్ధిదారులకు పట్టాదారు పాస్‌బుక్కులను అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమం నిర్వహణకు అవసరమైన వేదిక, ప్రజలు కూర్చునే ఏర్పాట్లు, ముఖ్య అతిథుల రాకపోకలు, ఇతర మౌలిక సదుపాయాలను మంత్రి పరిశీలించారు.

ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పార్థసారథి సూచించారు. హెలిప్యాడ్‌ వద్ద భద్రతా ఏర్పాట్లు, కార్యక్రమ ప్రాంగణంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు.

ప్రజావేదిక, క్యాడర్‌ సమావేశం తదితర కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను కూడా మంత్రి పరిశీలించారు. సీఎం పర్యటనకు వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంత్రి పార్థసారథితో పాటు స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి చంటి, ముఖ్య నాయకులు, ఉన్నతాధికారులు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్‌ తదితరులు ఏర్పాట్ల పరిశీలనలో పాల్గొన్నారు.