నూతన హంగులతో ఆనం క్యాంప్ కార్యాలయం

  • అధునాతన కాన్ఫరెన్స్ హాల్‌
  • అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు ప్రతిబింబంగా రూపుదిద్దుకున్న కార్యాలయం
  • మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

నెల్లూరు, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ విజయాలకు ప్రతీకగా నెల్లూరు సంతపేటలోని తన క్యాంప్ కార్యాలయాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దినట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. పార్టీ సమావేశాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అధునాతన కాన్ఫరెన్స్ హాల్‌ను నూతన హంగులతో తీర్చిదిద్దడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

రెండేళ్ల పాలనకు ప్రతిబింబంగా కాన్ఫరెన్స్ హాల్..

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకు ప్రతీకగా ఈ కాన్ఫరెన్స్ హాల్‌ను రూపొందించినట్లు ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై పెరిగిన నమ్మకానికి, ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీలకు ప్రతిబింబంగా క్యాంప్ కార్యాలయం రూపుదిద్దుకుందని చెప్పారు.

‘ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం’

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానేత నందమూరి తారక రామారావు సిద్ధాంతాలను ప్రతిబింబించేలా క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం’ అనే ఎన్టీఆర్ సిద్ధాంతానికి ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని మంత్రి పేర్కొన్నారు.

ఆనం వివేకానంద రెడ్డికి ప్రత్యేక స్థానం..

నెల్లూరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ఆనం వివేకానంద రెడ్డి చిత్రపటాన్ని కూడా కాన్ఫరెన్స్ హాల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అలంకరించినట్లు తెలిపారు. ఆయన జ్ఞాపకాలను స్మరించుకునేలా కార్యాలయానికి ప్రత్యేక రూపాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపేలా, పార్టీ భవిష్యత్ కార్యాచరణకు వేదికగా నిలిచేలా క్యాంప్ కార్యాలయాన్ని సిద్ధం చేసినట్లు ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.

పార్టీ సమావేశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు, పార్టీ శ్రేణులతో సమన్వయం వంటి కార్యక్రమాలకు ఈ అధునాతన కాన్ఫరెన్స్ హాల్‌ వేదికగా నిలవనుంది.

ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాం..

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆనం రామ నారాయణరెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ విజయ ప్రస్థానం మరింత ఉజ్వలంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ పార్టీ భవిష్యత్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు క్యాంప్ కార్యాలయం కీలక వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.