తాడిపత్రిలో టెన్షన్..
- పెద్దిరెడ్డి రంగ ప్రవేశం
- ర్యాలీకి హాజరు
- భారీ జన సమీకరణ
- ఏర్పాట్లలో పెద్దారెడ్డి
- పోలీసు అనుమతి ఓకే
- డీఎస్సీ అక్రమాలపై ఆందోళన
అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం తాడిపత్రికి వస్తున్నట్లు ఆ పార్టీ పెద్దలు ప్రకటించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేయించాలని ర్యాలీ నిర్వహిస్తున్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి లేకుండా ర్యాలీ చేసుకోవాలని అంటున్నారు. పెద్దారెడ్డి పాల్గొంటే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో సోమవారం జరిగే ర్యాలీ ఎటువంటి పరిణామలకు దారితీస్తుందన్న అంశం ఉత్కంఠంగా మారింది.
భారీ ఏర్పాట్లు..
ఈ ర్యాలీని విజయవంతం చేసినందుకు కోసం తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కసరత్తు ప్రారంభించారు. నియోజకవర్గంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయా మండల ఇన్చార్జిలకు బాధ్యతను అప్పగించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గంలో పర్యటించే సమయంలో శాంతిభద్రతల సమస్య పేరుతో పోలీసులు బ్రేక్ చేస్తూ వచ్చారు.
దీనిపై సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. హైకోర్టులో అనుమతులు పొందినప్పటికీ ఆ ఉత్తర్వులు అమలు కాలేదు. తర్వాత ఇదే అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే విధంగా సూచించింది. దీంతో పెద్ద రెడ్డి తాడిపత్రిలో తన నివాసంలో ఉంటూ నియోజకవర్గం లో కార్యక్రమాలలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.
అయినప్పటికీ పోలీసుల అక్షేపణల నేపథ్యంలో కొంతకాలం సంయమనం పాటించారు. అయితే ఈ మధ్యకాలంలో పార్టీ పిలుపులో భాగంగా మండల కేంద్రాల్లో డీఎస్సీ అక్రమాలపై రిలే దీక్షలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో కార్యక్రమాలు జరిగాయి.
యాడికి లో జరిగిన దీక్షకు పెద్దారెడ్డి హాజరుకాగా అదే రోజు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి స్థానికంగా కార్యక్రమాలు పెట్టుకోవడంతో దీక్షను వాయిదా వేయాలని పోలీసులు కోరారు. అయితే పెద్దారెడ్డి ముందుగా ప్రకటించిన విధంగా దీక్షలో పాల్గొనేందుకు వెళ్లగా తెలుగుదేశం, వైసిపి కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
పెద్దారెడ్డిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు నియోజకవర్గంలో ఉండగా సోమవారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడిపత్రికి వస్తుండడంతో పరిస్థితి ఎలా ఉంటుందో అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే కార్యక్రమ నిర్వహణకు సంబంధించి పోలీసులు అనుమతి ఇచ్చినట్లు వైసిపి నాయకులు చెబుతున్నారు.
ఏదైనా సమస్య తలత్తుతుందేమోనని రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమకాలికుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివాదాలకు దూరంగా ఉంటారు.
పార్టీలోను, సామాజిక వర్గంలో పెద్దమనిషిగా చలామణి అవుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఆయన పర్యటన కు తాడిపత్రిలో అడ్డంకులు ఉండవు అని అంచనా వేస్తున్నారు. అయితే పోలీసులు ఈ కార్యక్రమానికి ఎంత మేరకు అనుమతి ఇస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ర్యాలీ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులను సమీకరించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.
ఇప్పటిదాకా మండలాల్లో పెద్దారెడ్డి అప్పుడప్పుడు పర్యటిస్తున్నారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి నేరుగా పర్యటించకుండా శాంతిభద్రతల పేరుతో పోలీసులు అడ్డుకుంటూ వస్తున్నారు. సోమవారం జరిగే ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే పాల్గొంటారని వైసీపీ నాయకులు కార్యకర్తలు చెబుతున్నారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయంగా ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను తెలియజేయడమే కాకుండా ఆ ఎన్నికల్లో పాల్గొనేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులను సమాయత్తం చేసే బాధ్యత పెద్దారెడ్డి పై ఉంది. మరి తాడిపత్రిలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఏ మేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే.
