ఆధ్యాత్మికతతోనే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం..

  • సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత
  • ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

(నందిగామ, ఆంధ్రప్రభ) : ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావంతో పాటు ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ పట్టణం గీత మందిర్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ సత్యసాయి మందిరంలో నిర్వహించిన ఆషాఢ మాస సారె కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సత్యసాయి కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, మహిళలతో కలిసి సారె కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.

తరతరాలుగా కొనసాగుతున్న ఆచారాలను పరిరక్షిస్తూ, వాటి విశిష్టతను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా మహిళలు నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలు కుటుంబాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.

భక్తి, సేవ, మానవత్వం అనే విలువలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. నందిగామ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్యసాయి కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు, కూటమి నేతలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.