చెన్నూరులో ఘనంగా గడి మైసమ్మ బోనాల జాతర

చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఆదివారం గడి మైసమ్మ బోనాల జాతర కనులపండువగా సాగింది. పట్టణంలోని జేబీఎస్‌ పాఠశాల సమీపంలో ఉన్న గడి మైసమ్మ ఆలయం వద్ద ప్రతి ఏటా ఆషాఢమాసంలో భక్తులు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మహిళలు తమ ఇళ్ల నుంచి బోనాలను ఎత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సమర్పించారు.

బోనాల సందర్భంగా పోతరాజుల విన్యాసాలు, డీజే సంగీతానికి యువకుల నృత్యాలతో ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.