డీఎస్సీపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి..

  • కర్నూలులో డీఎస్సీ అభ్యర్థుల ఆత్మగౌరవ సంఘీభావ ర్యాలీ
  • కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ వరకు భారీ ప్రదర్శన

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్‌సీపీ నాయకులు, అనుబంధ వర్గాలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్న విష ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారంకర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద డీఎస్సీ అభ్యర్థులు, ఉపాధ్యాయులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు.

కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. డీఎస్సీ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఎలాంటి తప్పుడు ఆరోపణలు చేయవద్దని వారు పేర్కొన్నారు.

కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభమైన ఈ ఆత్మగౌరవ సంఘీభావ ర్యాలీ ఓల్డ్ కంట్రోల్ రూమ్ మీదుగా జిల్లా పరిషత్ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న అభ్యర్థులు డీఎస్సీ నియామకాలపై అసత్య ప్రచారాలను ఖండిస్తూ నినాదాలు చేశారు.

డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ప్రతిభను, కష్టాన్ని రాజకీయ విమర్శలతో కించపరచడం సరికాదని వారు పేర్కొన్నారు. నియామకాలపై నిరాధార ఆరోపణలు మానుకుని, ఉద్యోగాలు పొందిన యువతను గౌరవించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.