ఓవైసీ కాలేజీ కేసులో అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా పలువురు ఉన్నతాధికారులకు నోటీసులు
సల్కం చెరువు నిర్మాణాలపై ఆదేశాల అమలులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్, ఆంధ్రప్రభ : సల్కం చెరువు పరిధిలోని బారిస్టర్ ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల నిర్మాణాలకు సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు పలువురు ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు విద్య, రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు చెందిన ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.

సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్ పరిధిలో ఫాతిమా ఓవైసీ విద్యా సంస్థల నిర్మాణాలపై గతంలో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు విచారిస్తోంది. నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు, చెరువు సరిహద్దులు, ఎఫ్‌టీఎల్‌ పరిధి తదితర అంశాలపై సమగ్ర వివరాలు, రికార్డులు సమర్పించాలని గత విచారణల్లో అధికారులను ఆదేశించింది. అయితే ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుపై హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. దీంతో సంబంధిత ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన రికార్డులు, అధికారుల వివరణలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.

కాగా, సల్కం చెరువు ప్రాంతంలోని నిర్మాణాలపై హైకోర్టు గత కొంతకాలంగా తీవ్రంగా దృష్టి సారించింది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ల పరిరక్షణ విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ప్రశ్నలు లేవనెత్తింది. మరోవైపు, సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో హైకోర్టుకు తెలిపింది.

హైడ్రా కూడా కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే వ్యవహరిస్తామని గతంలో స్పష్టం చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్‌ సరిహద్దులను నిర్ధారించేందుకు రెవెన్యూ, నీటిపారుదల శాఖల సంయుక్త సర్వేలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.