కృష్ణా నదిలో గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం

చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి.. బొబ్బర్లంకలో విషాదం

మోపిదేవి, ఆంధ్రప్రభ: చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు కృష్ణా నదిలో గల్లంతై మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో శుక్రవారం విషాదాన్ని నింపింది.

గ్రామానికి చెందిన పీత నాగరాజు (35) చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఎప్పటిలాగే కృష్ణా నదిలో చేపల వేటకు వెళ్లాడు. అయితే రాత్రంతా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

శుక్రవారం తెల్లవారుజాము నుంచి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కలిసి కృష్ణా నది వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో గ్రామానికి సమీపంలోని కృష్ణా నదిలో నాగరాజు మృతదేహం తేలియాడుతూ కనిపించింది.

వెంటనే రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు. వీఆర్వో వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మృతుడు నాగరాజుకు తల్లి, భార్య ఉన్నారు. ఈ ఘటనతో బొబ్బర్లంక గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.