అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల దరఖాస్తుల ప్రాథమిక జాబితా విడుదల
ఆగస్టు 13లోపు అభ్యంతరాలు స్వీకరణ
సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూ తేదీలు త్వరలో ప్రకటన
గోవిందరావుపేట, ఆంధ్రప్రభ : తాడ్వాయి ఐసీడీఎస్ పరిధిలో అంగన్వాడీ టీచర్, హెల్పర్ ఖాళీల భర్తీ కోసం స్వీకరించిన దరఖాస్తుల తొలి దశ పరిశీలన పూర్తయినట్లు సీడీపీవో ప్రేమలత తెలిపారు.
తదుపరి సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అర్హులు, అనర్హుల జాబితాలను సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులపై ప్రదర్శించినట్లు వెల్లడించారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో జాబితాలను పరిశీలించాలని సూచించారు. జాబితాలో పొందుపరిచిన వివరాలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 13 సాయంత్రం 5 గంటలలోపు తాడ్వాయి ఐసీడీఎస్ సీడీపీవో కార్యాలయంలో వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు.
అందిన అభ్యంతరాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుని సమాధానం అందజేస్తామని సీడీపీవో ప్రేమలత పేర్కొన్నారు.
తదుపరి దశలో నిర్వహించే అసలు ధ్రువపత్రాల పరిశీలన తేదీలను సంబంధిత అభ్యర్థులకు వ్యక్తిగతంగా తెలియజేయనున్నట్లు తెలిపారు. అనంతరం ఇంటర్వ్యూ తేదీలను కూడా అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.
అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలని సీడీపీవో ప్రేమలత విజ్ఞప్తి చేశారు.
