తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం

  • ప్రతి చిన్నారికి తొలి ఆరు నెలలు తల్లిపాలే అందించాలి
  • ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
  • ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆరోగ్య అవగాహన
  • మహిళా,శిశు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం
  • తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి ఇంటికీ చేర్చాలని పిలుపు

తిరువూరు, ఆంధ్రప్రభ: తల్లిపాలు బిడ్డకు తొలి టీకా… జీవితానికి రక్షణ కవచం అని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం తిరువూరు పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని తెలిపారు. తల్లిపాలు శిశువుల శారీరక, మానసిక, మేధో వికాసానికి అత్యంత కీలకమని, ప్రతి తల్లి తన బిడ్డకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని సూచించారు.

పుట్టిన తర్వాత తొలి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం పౌష్టికాహారంతో పాటు రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం తల్లిపాలను కొనసాగించాలని ఆయన సూచించారు. గర్భిణీలు, బాలింతలు సమతుల్య పౌష్టికాహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే గర్భిణీలు, బాలింతలు, తల్లులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, చిన్నారుల పోషకాహారం, తల్లిపాల అందిస్తున్న విధానం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య, పోషకాహార సేవలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా, శిశు సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న ఎమ్మెల్యే, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందిస్తున్న సేవలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా అధికారులు మరింత చొరవతో పనిచేయాలని కోరారు.

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందేశాన్ని ప్రతి ఇంటికీ చేర్చి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఐసీడీఎస్ ప్రాజెక్టు సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, వైద్య సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు, తల్లులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.