వెంకటాపూర్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్

గజ్వేల్, ఆంధ్ర‌ప్ర‌భ : గజ్వేల్ నియోజకవర్గంలోని వెంకటాపూర్ గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పరిసరాల్లో 2 వేల మొక్కలను నాటినట్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు పచ్చని తెలంగాణను అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. ఈరోజు నాటే ప్రతి మొక్క రేపటి తరాలకు ఇచ్చే విలువైన హామీ అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆలోచనలతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఏకం చేస్తూ, హరిత తెలంగాణ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.

ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వెంకటాపూర్ సర్పంచ్ కనకయ్య, చేప్యాల రాజేశ్వర్‌రావు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులకు సంతోష్‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.