Chandrababu | ‘నేతన్న సేవలో’ పథకానికి శ్రీకారం..
చేనేత కుటుంబాలకు రూ.25 వేల సాయం
71,636 కుటుంబాలకు రూ.179 కోట్ల ఆర్థిక సాయం.. చేనేత వైభవాన్ని తిరిగి తీసుకొస్తామని హామీ
Chandrababu |ఆంధ్రప్రభ, చీరాల: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 71,636 చేనేత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని, ఇందుకోసం రూ.179 కోట్లను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని చెప్పారు.
చేనేత భారతీయ సంస్కృతికి ప్రతీక
చేనేత కార్మికులంటే తనకు ప్రత్యేక అభిమానం ఉందని సీఎం పేర్కొన్నారు. చేనేత కేవలం ఒక వృత్తి కాదని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, నరసాపురం వంటి ప్రాంతాల చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని గుర్తు చేశారు.
పెన్షన్లు, సబ్సిడీలు.. పలు సంక్షేమ చర్యలు
రాష్ట్రంలో సుమారు 1.27 లక్షల మంది చేనేతపై ఆధారపడి జీవిస్తున్నారని సీఎం తెలిపారు. 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు పెన్షన్ అందించిన తొలి ప్రభుత్వం తమదేనని చెప్పారు. ప్రస్తుతం 85 వేల మంది చేనేత కార్మికులకు పెన్షన్లు అందిస్తున్నామని, వాటిని రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచామని వెల్లడించారు.
అలాగే 109 చేనేత సహకార సంఘాలకు రూ.79 కోట్ల క్యాష్ క్రెడిట్, 10 చేనేత క్లస్టర్ల అభివృద్ధికి రూ.10 కోట్లు, మార్కెటింగ్ ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాలు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
సూపర్ సిక్స్ హామీల అమలు కొనసాగుతోంది
ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల అమలులో ముందుకు సాగుతోందని సీఎం పేర్కొన్నారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, అన్నదాత సుఖీభవ, డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు, మత్స్యకారులకు రూ.505 కోట్ల ఆర్థిక సాయం, వడ్డర్లకు మైనింగ్ లీజులు, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం వాటా, సోలార్ రూఫ్‌టాప్‌లకు సబ్సిడీలు వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
