కర్నూలులో అదనపు ఎన్నికల నమోదు అధికారుల నియామకం

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు
ఓటరు జాబితాల నిర్వహణ వేగవంతానికి వివిధ శాఖల అధికారులకు అదనపు బాధ్యతలు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఓటరు జాబితాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు భారత ఎన్నికల సంఘం అదనపు సహాయ ఎన్నికల నమోదు అధికారుల (ఏఈఆర్‌ఓలు) నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కర్నూలు జిల్లాలోని కర్నూలు, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనపు ఏఈఆర్‌ఓలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ అధికారులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, ఉద్యానశాఖ తదితర విభాగాల అధికారులకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించింది.

ఈ నియామకాలతో ఓటరు జాబితాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల మార్పులు, అభ్యంతరాల పరిష్కారం, ఎన్నికల దరఖాస్తుల పరిశీలన వంటి ప్రక్రియలు మరింత వేగవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడనుంది. నియోజకవర్గాల వారీగా సంబంధిత శాఖల అధికారులను అదనపు సహాయ ఎన్నికల నమోదు అధికారులుగా నియమించడం ద్వారా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సమర్థత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.