గుడిపల్లిలో కోతుల బెడద.. ప్రజలు బెంబేలు
అటవీశాఖ చర్యలు చేపట్టాలని గ్రామస్తుల విజ్ఞప్తి
వికారాబాద్, ఆంధ్రప్రభ: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గుడిపల్లి గ్రామంలో కోతుల సంచారం రోజురోజుకూ పెరుగుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడవులు, పంట పొలాల్లో ఉండాల్సిన కోతులు గ్రామంలోకి వచ్చి ఇళ్లపైకి ఎక్కుతూ, వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి సైతం భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
గ్రామంలో ప్రతిరోజూ కోతుల సంచారం సాధారణంగా మారిందని, ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తాయో తెలియని పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడదను నివారించేందుకు అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి వాటిని అడవుల్లోకి తరలించే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
