ఆంధ్రప్రభ కథనంపై ప్రభుత్వం స్పందన

జోగిపేట ఏరియా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రమేష్ సస్పెన్షన్
నకిలీ వైద్య సేవల ఆరోపణలపై విచారణకు ఆదేశాలు

సంగారెడ్డి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుడికి బదులుగా ఓ ప్రైవేటు వ్యక్తి వైద్య సేవలు అందిస్తున్న ఘటనను వెలుగులోకి తెచ్చిన ఆంధ్రప్రభ కథనంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. “సర్కారు వైద్య సేవల్లో నకిలీల కలకలం” శీర్షికతో ప్రచురితమైన కథనాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ వ్యవహారంలో బాధ్యుడిగా భావించిన జోగిపేట ఏరియా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ కె. రమేష్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఆంధ్రప్రభ వెలుగులోకి తీసుకొచ్చిన అంశంపై ప్రభుత్వం వేగంగా స్పందించి చర్యలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.