మోదీకి ఇజ్రాయిల్ ప్రధాని ఫొన్..
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య గురువారం టెలిఫోన్ సంభాషణ జరిగింది. భారత్-ఇజ్రాయెల్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతితో పాటు పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది.
ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు, పరస్పర ప్రయోజనకరమైన రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు ఇద్దరు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. రక్షణ, సాంకేతికత, వాణిజ్యం తదితర రంగాల్లో భారత్-ఇజ్రాయెల్ సహకారం కొనసాగుతోందని పీఎంఓ పేర్కొంది.
పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై మోదీ, నెతన్యాహు అభిప్రాయాలను పంచుకున్నారని, భవిష్యత్తులోనూ పరస్పరం సంప్రదింపులు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ ఏడాది మార్చిలో కూడా ఇరువురు నేతలు ప్రాంతీయ పరిస్థితులపై చర్చించారు. భారత్, ఇజ్రాయెల్ దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) చర్చలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు పలు రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తున్నాయి.
ఇటీవల ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్-ఇజ్రాయెల్ సంబంధాలు బలమైన దిశలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రక్షణ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యం మరింత విస్తరిస్తోందని తెలిపారు.
