స్పోర్ట్స్ కోటా నియామకాలు పారదర్శకంగానే..

  • పురుషోత్తం ఆరోపణలు నిరాధారం
  • సాక్ష్యాలతో ముఖాముఖి చర్చకు సవాల్
  • తప్పుడు ప్రచారంపై సీఐడీ, విజిలెన్స్ విచారణ చేయాలి
  • ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎన్. వెంకట్

విజయవాడ, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా నియామకాలు, మెగా డీఎస్సీ క్రీడా కోటా ఎంపికలపై ఇటీవల జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ, గుర్తింపు పొందిన క్రీడా సంఘాలు, నిజమైన క్రీడాకారుల ప్రతిష్ఠను దెబ్బతీసే ఉద్దేశంతో కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.

విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ వెంకట్ నాన్శెట్టి మాట్లాడుతూ.. మెగా డీఎస్సీతో పాటు స్పోర్ట్స్ కోటా నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, క్రీడల శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యం లభిస్తోందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా స్పోర్ట్స్ కోటాను మూడు శాతానికి పెంచి క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని చెప్పారు.

మెగా డీఎస్సీలో 423కు పైగా స్పోర్ట్స్ కోటా పోస్టులు కేటాయించగా, అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో సుమారు 50 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయని తెలిపారు. అర్హత ఉన్న క్రీడాకారులకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ నుంచి ఒలింపిక్ స్థాయి వరకు ప్రభుత్వ జీవోలో పొందుపరిచిన నిబంధనల ప్రకారమే మార్కుల కేటాయింపు, ధ్రువీకరణ, ఎంపిక జరిగిందన్నారు. జిల్లా స్థాయి కమిటీలు, సాంకేతిక కమిటీలు, స్పోర్ట్స్ అథారిటీ, గుర్తింపు పొందిన క్రీడా సంఘాల పరిశీలన అనంతరమే ప్రతి అభ్యర్థిని ఎంపిక చేశారని వివరించారు.

పురుషోత్తంకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ లేదా అధికారిక ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ నుంచి ఎలాంటి గుర్తింపు లేదని ఆరోపించారు. రాష్ట్ర విభజన అనంతరం కాకినాడలో వేరే సంస్థను నమోదు చేసి అధికారిక సంస్థగా ప్రచారం చేసుకుంటున్నారని, 2014 నుంచి కోర్టు వివాదాలకే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ, క్రీడా సంఘాలు, అధికారులపై ఆధారాలు లేకుండా బురదజల్లడం ద్వారా క్రీడాకారులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. జూడో అసోసియేషన్‌పై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తులకు అధికారిక సంఘంతో ఎలాంటి సంబంధం లేదని, గతంలో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు సభ్యులను శాశ్వతంగా సస్పెండ్ చేశామని తెలిపారు.

సర్టిఫికెట్ అక్రమాలపై గతంలో సీబీసీఐడీ విచారణ కూడా జరిగిందని, సంబంధిత కేసులు ఇప్పటికీ న్యాయస్థానాల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. తాము రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్‌లో నమోదు అయిన అధికారిక సంస్థమని, జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిన సంఘమని స్పష్టం చేశారు. గత ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ సహకారం లేకున్నా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేస్తూ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. జూడో క్రీడాకారులకు మాత్రమే స్పోర్ట్స్ కోటాలో దాదాపు 30 ఉద్యోగాలు రావడం పారదర్శక ఎంపిక వ్యవస్థకు నిదర్శనమని పేర్కొన్నారు.

పురుషోత్తం చేస్తున్న ప్రతి ఆరోపణకు పత్రాధారాలతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, అన్ని రికార్డులతో బహిరంగంగా ముఖాముఖి చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ, క్రీడా సంఘాలు, న్యాయవ్యవస్థపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ క్రీడాకారుల భవిష్యత్తుతో ఆడుకోవడం సరికాదన్నారు. స్పోర్ట్స్ కోటాలో నిజమైన క్రీడాకారులకు ఎక్కడా అన్యాయం జరగలేదని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చట్టబద్ధంగా నిరూపించాలని సూచించారు.

తప్పుడు ఆరోపణలు చేసి ప్రభుత్వ ప్రతిష్ఠను, క్రీడా సంఘాల విశ్వసనీయతను దెబ్బతీస్తున్న వారిపై సుమోటోగా సీఐడీ, విజిలెన్స్ లేదా ఇతర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జూడో అసోసియేషన్ కోరింది. అవసరమైతే అన్ని ఆధారాలను సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, క్రీడా వ్యవస్థను అపప్రథకు గురిచేసే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేసింది. ఈ విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ ఉపాధ్యక్షులు గణేష్ సుబ్బారావు, చింతా శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలు డాక్టర్ భాస్కర్ నాయుడు, డాక్టర్ గమడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.