ఎల్‌నినో గండం ముగిసినట్టేనా..?
ఆంధ్రప్రభ : కొన్ని నెలల క్రితం వరకు దేశమంతా… ‘‘ఇంత ఎండ ఎప్పుడూ చూడలేదు’’ అనే మాటే వినిపించింది. ఉదయం ఎనిమిది గంటలకే మండిపోతున్న సూర్యుడు… మధ్యాహ్నం రోడ్లపై నిప్పులు కురిపిస్తున్న ఉష్ణోగ్రతలు… ఒక్కో రాష్ట్రంలో 45 డిగ్రీలు దాటిన వేడి… పగిలిపోతున్న భూమి… అడుగంటిపోయిన బోర్లు… నీళ్లు లేని చెరువులు… బీటలు వారిన పంటపొలాలు… ట్యాంకర్ నీళ్ల కోసం క్యూలో నిలబడ్డ కుటుంబాలు… ఆ దృశ్యాలు ఇంకా ప్రజల మదిలో నుంచి చెరిగిపోలేదు. కానీ ప్రకృతి ఒక్కసారిగా మరో రూపం చూపించింది.
అయితే, జూలై చివరి నుంచి ఆగస్టు మొదటి వారానికి వచ్చేసరికి దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. కొన్ని రోజులుగా వాతావరణం మారిపోయింది… మండే ఎండలు తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎండిపోయిన చెరువులు, కుంటలు మళ్లీ నీటితో నిండుతున్నాయి. వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది. నగరాల్లో కూడా దుమ్ము తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దీంతో ఇక ఎల్‌నినో ముగిసిపోయిందా? అనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. సోషల్ మీడియా నుంచి టీ స్టాళ్ల వరకు… పొలాల్లోని రైతుల నుంచి ఆఫీసు ఉద్యోగుల వరకు.. వాతావరణంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరి నోటా ఇదే ప్రశ్న మెదులుతోంది. అయితే, ఈ విషయం మీద వాతావరణ నిపుణులు ఏంచెబుతున్నారు..
ఎల్‌నినో అంటే అసలు ఏమిటి?
ఎల్‌నినో అనే పదం చాలామందికి తెలుసు. కానీ అది ఎలా ఏర్పడుతుంది? ఎందుకు ప్రపంచమంతా దాని గురించి మాట్లాడుతుంది? అసలు అది భారతదేశాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? దీనిని అర్థం చేసుకోవాలంటే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రం వైపు చూడాలి. దక్షిణ అమెరికా తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో కొన్ని నెలల పాటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతాయి. దీంతో అక్కడ గాలి ప్రవాహాలు మారిపోతాయి. ఆ మార్పు క్రమంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావమే ఎల్‌నినో. పసిఫిక్‌లో మొదలైన ఈ మార్పు… భారత్‌లో వర్షాలను తగ్గించగలదు. ఆస్ట్రేలియాలో కరువు తీసుకురాగలదు. దక్షిణ అమెరికాలో భారీ వరదలు సృష్టించగలదు. ఆఫ్రికాలో కరువు పెంచగలదు. అంటే ఒక సముద్రంలో ఉష్ణోగ్రత పెరగడం… ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది.
ఎల్‌నినో, లా నినా రెండూ ఒకే నాణానికి రెండు వైపుల్లాంటివి. ఇవి రెండూ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే సహజ వాతావరణ చక్రాలే. అయితే వాటి ప్రభావం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎల్‌నినో సమయంలో పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరుగుతాయి. దీంతో గాలి ప్రవాహాలు మారి ప్రపంచవ్యాప్తంగా వర్షపాతం నమూనాలు దెబ్బతింటాయి. అదే లా నినా సమయంలో సముద్ర జలాలు సాధారణం కంటే చల్లబడతాయి.
ఎల్ నినో అనేది ప్రతి రెండు నుంచి ఏడు సంవత్సరాలకు ఒకసారి ఇది సంభవిస్తుంది. ఒకసారి ప్రారంభమైతే సాధారణంగా తొమ్మిది నెలల నుంచి ఏడాది వరకు, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువకాలం కూడా కొనసాగవచ్చు. భారత్ వంటి దేశాలకు ఎల్‌నినో అంటే ప్రధానంగా రుతుపవనాల బలహీనత. సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురవాల్సిన వర్షాలు తగ్గిపోవడం, వర్షపాతం అసమానంగా ఉండటం, కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడటం, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడటం వంటి పరిణామాలు కనిపిస్తాయి.
ఈ ఏడాది వేసవి… మరచిపోలేని అనుభవం
కొద్ది నెలల క్రితం వరకు దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి గుర్తు చేసుకుంటే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల విలువ అర్థమవుతుంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను తాకాయి. కొన్ని ప్రాంతాల్లో 47 డిగ్రీలకు కూడా చేరువయ్యాయి. ఉదయం 7 నుంచి 8 గంటలకే బయటకు వెళ్లడం కష్టంగా మారింది. మధ్యాహ్నం రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యవసాయ భూములు పగుళ్లు తీశాయి. చెరువులు ఎండిపోయాయి. నదుల్లో నీటి ప్రవాహం గణనీయంగా తగ్గింది. జంతువులు నీటి కోసం గ్రామాల్లోకి వచ్చాయి. పక్షులు కూడా దాహంతో అలమటించాయి. నగరాల్లో విద్యుత్ వినియోగం భారీగా పెరిగి విద్యుత్ సరఫరాపై ఒత్తిడి ఏర్పడింది.
గ్రామాల్లో పరిస్థితి ఒకలా ఉంటే… మహానగరాల్లో మరోలా కనిపించింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో నీటి కొరత తీవ్రస్థాయికి చేరుకుంది. అనేక కాలనీల్లో మున్సిపల్ నీటి సరఫరా తగ్గిపోయింది. వేలాది కుటుంబాలు ప్రైవేట్ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఒక ట్యాంకర్ నీటి కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. కొత్త బోర్లు వేసినా నీరు రాలేదు. భూగర్భ జలమట్టం ఎన్నడూ లేనంతగా పడిపోయింది. కొంతమంది అపార్ట్మెంట్లలో నీటిని గంటల వారీగా పంపిణీ చేశారు.
ఎల్‌నినో ముగిసిందా?
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు నిస్సందేహంగా ఊరటనిస్తున్నాయి. చెరువులు నిండుతున్నాయి. సాగునీటి పరిస్థితి మెరుగుపడుతోంది. భూగర్భ జలాలు కొంత మేర రీఛార్జ్ అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో ప్రజలకు ఉపశమనం లభిస్తోంది. అయితే, మంచి రుతుపవన కాలం గత నష్టాలను పూర్తిగా భర్తీ చేయలేదని శాస్త్రవేత్తల చెబుతున్నారు. భూగర్భ జలాల పునరుద్ధరణ అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. ఒకటి రెండు నెలల వర్షాలతో అది పూర్తికాదు. గత కొన్నేళ్లుగా నిరంతరంగా నీటిని అధికంగా వినియోగించడం, చెరువుల ఆక్రమణలు, వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశాలు తగ్గిపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాల పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది.
వాతావరణ నిపుణులు చెబుతున్నదేమిటంటే… కొన్ని రోజుల వర్షాలు కురవడం, కొన్ని రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం వల్ల ఎల్‌నినో ప్రభావం పూర్తిగా ముగిసిపోయిందని తేల్చలేం. ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఉష్ణోగ్రతలు, గాలి ప్రవాహాలు, వర్షపాతం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. భారత్‌లో ప్రస్తుతం అల్పపీడనాలు, రుతుపవనాల చురుకుదనం, ప్రాంతీయ వాతావరణ వ్యవస్థల కారణంగా మంచి వర్షాలు కురుస్తున్నా… ప్రపంచ స్థాయిలో వాతావరణ నమూనాలను పరిశీలించిన తర్వాతే ఎల్‌నినో స్థితిపై స్పష్టమైన నిర్ణయానికి రావచ్చు.
ఒకవైపు వరదలు… మరోవైపు కరువు
వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఒకప్పుడు వర్షాలు తగ్గితే కరువు… ఎక్కువైతే వరదలు అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఒకే రాష్ట్రంలో ఒక జిల్లాలో వరదలు, మరో జిల్లాలో కరువు కనిపిస్తోంది. కొన్ని గంటల్లో నెలరోజుల వర్షపాతం నమోదవుతోంది. అదే సమయంలో మరో ప్రాంతంలో వారం రోజుల పాటు ఒక్క చినుకు కూడా పడడం లేదు. భూమి ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయి. శిలాజ ఇంధనాల అధిక వినియోగం, కార్బన్ ఉద్గారాలు, అడవుల నరికివేత, పారిశ్రామిక కాలుష్యం, వేగవంతమైన పట్టణీకరణ… ఇవన్నీ కలిసి వాతావరణ వ్యవస్థను మార్చేస్తున్నాయి. ఇప్పుడు కేవలం వేసవులు మాత్రమే కాదు… వర్షాకాలం, శీతాకాలం కూడా అసాధారణంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఊహించగలిగే రుతుపవనాల తీరు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
సముద్రాలు కూడా జ్వరంతో ఉన్నాయా?
వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ప్రస్తుతం ప్రపంచ సముద్రాల పరిస్థితి కూడా అలాంటిదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు వరుసగా కొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. సాధారణంగా సముద్రాలు భూమి ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ఇప్పుడు అవే అసాధారణంగా వేడెక్కుతున్నాయి. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎక్కువ నీటి ఆవిరి ఏర్పడుతోంది. దాని ప్రభావంతో మేఘాల స్వభావం మారుతోంది. తుఫానులు మరింత శక్తివంతంగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాలు తీవ్ర వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి.
హెచ్చరిస్తున్న ఐక్యరాజ్యసమితి..
ప్రపంచ దేశాల సమావేశాల్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ పదేపదే ఒకే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. “ప్రపంచం వేడెక్కడం కాదు… మరిగిపోతోంది” అనే ఆయన వ్యాఖ్య వెనుక తీవ్రమైన ఆందోళన దాగి ఉంది. ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత వేడి సంవత్సరాల జాబితాలో గత పదేళ్లే ఎక్కువగా ఉండటం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. ప్రతి ఏడాది కొత్త ఉష్ణోగ్రత రికార్డులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ మార్పులు కేవలం వేసవిలో మాత్రమే కాకుండా సముద్రాల్లో, హిమనదుల్లో, ధృవ ప్రాంతాల్లో, ప్రపంచవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) హెచ్చరికల ప్రకారం వాతావరణంలో ఏర్పడుతున్న అస్థిరత భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో దీర్ఘకాలిక కరువు, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, అడవుల్లో పెద్దఎత్తున అగ్నిప్రమాదాలు, హిమనదుల వేగవంతమైన కరుగుదల, సముద్ర మట్టం పెరుగుదల వంటి పరిణామాలన్నీ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రకృతిలో ఒక చోట సంభవించే మార్పు మరోచోట తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందని వారు హెచ్చరిస్తున్నారు.
వ్యవసాయానికి ముందున్న సవాళ్లు
ఇటీవల కురుస్తున్న వర్షాలతో రైతులు కొంత ఊరట పొందుతున్నారు. ఖరీఫ్ సాగు ఊపందుకోవడంతో వ్యవసాయ పనులు వేగం పుంజుకున్నాయి. అయితే వ్యవసాయ నిపుణులు ఒక కీలక అంశాన్ని గుర్తుచేస్తున్నారు. వర్షాలు సమయానికి రావడం ఎంత ముఖ్యమో, అవి సమానంగా కురవడం కూడా అంతే అవసరం. కొద్ది గంటల్లోనే భారీ వర్షాలు కురిస్తే పొలాలు ముంపునకు గురై పంటలు దెబ్బతింటాయి. మరోవైపు ఎక్కువ రోజుల పాటు వర్షాలు లేకపోతే మొక్కలు ఎండిపోతాయి. ఈ విధంగా వాతావరణంలో పెరుగుతున్న అనిశ్చితి రైతులకు కొత్త సవాళ్లను తెచ్చిపెడుతోంది. దీంతో పంటల దిగుబడి, రైతుల ఆదాయం రెండూ ప్రభావితమవుతున్నాయి.
అదేవిధంగా, వర్షాలు కురిసిన తర్వాత బావులు, బోర్లు త్వరగా నిండిపోయేవి. ఇప్పుడు అదే పరిస్థితి చాలా చోట్ల కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ. సిమెంట్ రోడ్లు, కాంక్రీట్ భవనాలు, భూఆక్రమణలు పెరగడంతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా వర్షపు నీరు నేరుగా డ్రెయిన్లలోకి చేరి అక్కడి నుంచి నదులు, చివరకు సముద్రంలో కలిసిపోతోంది. దీంతో భూగర్భ జలాలు తిరిగి నిండే ప్రక్రియ మందగించి, భవిష్యత్తులో తాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నీటిని కాపాడకపోతే మరో సంక్షోభం తప్పదు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను కేవలం ఆనందించే కాలం మాత్రమే కాదు, వాటిని భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేసుకునే సమయం కూడా ఇదేనని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఇంట్లో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయడం, రూఫ్‌టాప్ రైన్వాటర్ హార్వెస్టింగ్‌ను తప్పనిసరిగా అమలు చేయడం అత్యవసరం. గ్రామాల్లో చెరువులు, కుంటలు, కాలువలను పునరుద్ధరించి ఆక్రమణలను తొలగించాలి. నగరాల్లో వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా ప్రత్యేక నిర్మాణాలను ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తేనే భూగర్భ జలాలను కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎదురయ్యే నీటి సంక్షోభాన్ని నివారించే అవకాశం ఉంటుంది.
వేడెక్కుతున్న భూమి..
భూమి ఎందుకు వేడెక్కుతోందనే ప్రశ్నకు సమాధానం మన జీవన విధానంలోనే దాగి ఉంది. వేగంగా పెరుగుతున్న పరిశ్రమలు, రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్య, బొగ్గు, పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల అధిక వినియోగం, అడవుల నరికివేత, కాంక్రీట్ నగరాల విస్తరణ వంటి అంశాలన్నీ కలిసి వాతావరణంలో గ్రీన్హౌస్ వాయువుల స్థాయిని పెంచుతున్నాయి. సాధారణంగా సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే వేడి తిరిగి అంతరిక్షంలోకి వెళ్లాలి. అయితే గ్రీన్హౌస్ వాయువులు ఆ వేడిని వాతావరణంలోనే బంధించడంతో భూమి క్రమంగా మరింత వేడెక్కుతోంది. ఇది ఒక్కరోజులో జరిగిన మార్పు కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న మానవ కార్యకలాపాల ఫలితమే నేటి పరిస్థితి. దీని ప్రభావం ఉష్ణోగ్రతల పెరుగుదలతో పాటు వర్షాల తీరు, సముద్రాల ఉష్ణోగ్రతలు, వ్యవసాయం, జీవవైవిధ్యం వంటి అనేక రంగాలపై స్పష్టంగా కనిపిస్తోంది.
వాతావరణ సమతుల్యతను కాపాడటంలో చెట్ల పాత్ర అత్యంత కీలకం. అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల వర్షపాతం విధానాల్లో కూడా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చెట్లు నేలలో తేమను నిల్వ చేయడమే కాకుండా పరిసర ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి. వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా సహకరించి భూగర్భ జలాల పునరుద్ధరణకు దోహదపడతాయి. అంతేకాదు, గాలిలోని కార్బన్ డైఆక్సైడ్‌ను గ్రహించి వాతావరణ మార్పుల ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయి. అందుకే ఒక చెట్టు నాటడం అంటే కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు నీటి భద్రత, పరిశుభ్రమైన గాలి, ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించే పెట్టుబడిగా కూడా భావించాలి.
ప్రభుత్వాల బాధ్యత ఏమిటి?
వాతావరణ మార్పులను పూర్తిగా అరికట్టడం ఒక్క దేశం, ఇక రాష్ట్రం వల్ల సాధ్యమయ్యే పని కాదు. అయితే వాటి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించే చర్యలు తీసుకోవడం మాత్రం ప్రతి ప్రభుత్వ బాధ్యత. వర్షపు నీటి సంరక్షణను తప్పనిసరి చేయడం, చెరువులు, కుంటలు, కాలువలను పునరుద్ధరించడం, పట్టణ ప్రణాళికలో నీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడం, భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించడం, రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు సూచనలు అందించడం, అడవుల విస్తరణకు పెద్దపీట వేయడం వంటి చర్యలు అత్యవసరం. అలాగే వరదలు, కరువులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడం కూడా ప్రభుత్వాల ప్రధాన బాధ్యతగా మారింది.
వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ప్రభుత్వాల పాత్ర ఎంత ముఖ్యమో, ప్రతి పౌరుడి బాధ్యత కూడా అంతే కీలకం. ఇంట్లో నీటి వృథాను తగ్గించడం, వర్షపు నీటిని నిల్వ చేసుకునే వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరూ కనీసం ఒక చెట్టైనా నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం, ఇంధన వినియోగాన్ని తగ్గించే అలవాట్లు అలవరచుకోవడం వంటి చిన్నచిన్న చర్యలు కూడా దీర్ఘకాలంలో పెద్ద మార్పుకు దోహదపడతాయి. ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రభుత్వాలకే పరిమితం కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతను నిర్వర్తించినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి.
ప్రకృతి ఇచ్చిన ఈ విరామాన్ని ఎలా ఉపయోగించుకోవాలి?
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మనకు ప్రకృతి ఇచ్చిన మరో విలువైన అవకాశంగా భావించాలి. గత వేసవిలో తాగునీటి కోసం ప్రజలు పడిన ఇబ్బందులు, ఎండిపోయిన బోర్లు, ఖాళీ అయిన చెరువులు, నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించిన గ్రామాల పరిస్థితి ఇంకా మరచిపోలేదు. ఆ అనుభవాలను గుర్తుంచుకుని ఇప్పుడున్న వర్షపు నీటిని భవిష్యత్తు కోసం భద్రపరచుకోవాలి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నింపడంతో పాటు వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకుంటేనే రాబోయే వేసవిని ధైర్యంగా ఎదుర్కోగలం. వర్షాలు పడుతున్నాయని నిర్లక్ష్యం చేయడం కాదు, అవి కురుస్తున్నప్పుడే ప్రతి నీటి చుక్కను భవిష్యత్తు కోసం దాచుకోవడం తెలివైన నిర్ణయం. ప్రకృతి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే నీటి భద్రతతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని కూడా కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది.
ఎల్‌నినో పూర్తిగా ముగిసిపోయిందా? అనే ప్రశ్నకు ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం. వాతావరణ మార్పుల ప్రభావం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సముద్రాల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అసాధారణ వాతావరణ సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. కాబట్టి ఈ చల్లని వాతావరణాన్ని చూసి నిర్లక్ష్యం చేసే సమయం కాదు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ప్రతి వర్షపు చుక్కను భవిష్యత్తు కోసం నిల్వ చేసుకోవాల్సిన సమయం. ప్రకృతితో పోరాడటం కాదు… ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకోవాల్సిన సమయం.
