కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం

శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ బండారి శ్రీనివాస్ రెడ్డి మృతి బాధాకరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీనివాస్ రెడ్డి కేవలం కాంట్రాక్టర్ మాత్రమే కాకుండా ప్రజాసేవలో చురుకుగా పనిచేసిన నాయకుడని తెలిపారు. క్రషర్ నిర్వహణ, నిర్మాణ పనుల ద్వారా సుమారు 200 మందికి ఉపాధి కల్పించారని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సీఆర్‌ఎఫ్ పనులకు సంబంధించిన రాష్ట్రవ్యాప్తంగా రూ.685 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండగా, శ్రీనివాస్ రెడ్డికి సుమారు రూ.5.3 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఈ బిల్లులు విడుదల చేయించేందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి ఇటీవలే చెక్కు విడుదల చేయించినట్లు వెల్లడించారు.

శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి రూ.5 కోట్ల బకాయిలు ఉండగా, రూ.54 కోట్ల మైనింగ్ నోటీసు ఇవ్వడం అనాలోచిత చర్య అని మంత్రి విమర్శించారు. మైనింగ్ అధికారులు, విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

కాంట్రాక్టర్లకు సంబంధించిన మైనింగ్, క్రషర్లు, గ్రావెల్ సమస్యలపై మైనింగ్ శాఖ మంత్రితో సమీక్ష నిర్వహించి పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. మృతికి కారణమైన అధికారుల బాధ్యతపై కూడా పరిశీలన చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లు ఎవరూ అధైర్యపడవద్దని మంత్రి భరోసా ఇచ్చారు. పెండింగ్ బిల్లులు, ఇతర సమస్యలను అసోసియేషన్ ద్వారా లేదా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.

శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు, బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు, ఆర్‌అండ్‌బీ అధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.