వీరశైవ జంగమ ధూప దీప నైవేద్య అర్చక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సదానిరంజన్ సిద్ధాంతి ఏకగ్రీవ ఎన్నిక
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో తెలంగాణ వీరశైవ జంగమ ధూప దీప నైవేద్య అర్చకుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.
ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 300 మంది అర్చకులు హాజరై అర్చకుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ధూప దీప నైవేద్య అర్చకులకు అందాల్సిన అన్ని సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
ప్రభుత్వ గుర్తింపు, ఆరోగ్య బీమా, పింఛన్, గౌరవ వేతనం, సామాజిక భద్రతతో పాటు దేవాలయాల్లో సేవల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. అర్చకుల ఆర్థిక పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీరశైవ జంగమ ధూప దీప నైవేద్య అర్చకులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి సంఘటితంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించారు.
అర్చకుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ చేపట్టాలని, అవసరమైతే వినతిపత్రాలు సమర్పించడం, ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా తెలంగాణ వీరశైవ జంగమ ధూప దీప నైవేద్య అర్చక సంఘం అడ్‌హాక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా గొంగళ్ళ మఠం రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సదానిరంజన్ సిద్ధాంతి, కోశాధికారిగా విభూది ప్రభులింగంను ఎన్నుకున్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్రంలోని వీరశైవ జంగమ ధూప దీప నైవేద్య అర్చకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
అర్చకుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల సాధన కోసం నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి అర్చకుడిని సంఘటితం చేసి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న అర్చకులు సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేసి రాష్ట్రవ్యాప్తంగా అర్చకుల సంక్షేమం కోసం సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
