నైపుణ్యాలే యువత విజయానికి పునాది
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాలే యువత విజయానికి పునాది అని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు.
మాదకద్రవ్యాలు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనపై దృష్టి సారించాలని యువతకు సూచించారు.
గురువారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అత్యాధునిక సాంకేతిక వసతులు, శిక్షణా ప్రయోగశాలలను పరిశీలించారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడిన ఎస్పీ వారి విద్య, శిక్షణ, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నారు.
క్రమశిక్షణతో నైపుణ్యాలను పెంపొందించుకుంటే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విద్యార్థులు సిగరెట్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏటీసీ ప్రిన్సిపాల్ జుమ్లానాయక్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐ నరేష్, ఏటీసీ సిబ్బంది, విద్యార్థులు, జిల్లా పోలీసు అధికారులు పాల్గొన్నారు.
