మహిళల భద్రతపై అవగాహన కల్పించిన పోలీసులు
జెన్‌టెక్ కంపెనీలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించిన చౌటుప్పల్ పోలీసులు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మోజీగూడెం గ్రామంలోని జెన్‌టెక్ కంపెనీలో గురువారం మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చౌటుప్పల్ సీఐ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ, మహిళలు విధులు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు సమాజంలో ఎదురయ్యే ఈవ్‌టీజింగ్, లైంగిక వేధింపులు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు.
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న షీ టీమ్స్, ఉమెన్ సేఫ్టీ, మహిళలపై నేరాల విభాగం ద్వారా అందుతున్న సేవలు, చట్టపరమైన రక్షణలపై సమగ్ర అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళల భద్రత కోసం చౌటుప్పల్ పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జెన్‌టెక్ కంపెనీ ప్రతినిధులు, మహిళా ఉద్యోగులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
