పెన్షనర్ల బకాయిలపై ధర్నాకు పిలుపు
పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: పెన్షనర్ల ఆర్థిక బకాయిల చెల్లింపుల్లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో పెన్షనర్ల జేఏసీ పిలుపుమేరకు నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ (ఎస్‌జీపీఏటీ) జిల్లా నాయకులు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు విజ్ఞప్తి చేశారు.
గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, గ్రాట్యుటీ, జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కమ్యూటేషన్ వంటి చెల్లింపులు ఇప్పటికీ అందలేదని వారు ఆరోపించారు. ఈ ఆలస్యం కారణంగా పలువురు పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరు అనారోగ్యానికి గురై అకాల మరణాలు కూడా చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్త వేతన సవరణను అమలు చేయకపోవడంతో పాటు ఆరు డీఏలను పెండింగ్‌లో ఉంచిందని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు భత్యాన్ని కూడా రాష్ట్రం అమలు చేయడం లేదని విమర్శించారు.
అలాగే ఆరోగ్య కార్డుల జారీ, గుర్తింపు పొందిన ఆసుపత్రుల జాబితా ఖరారు చేయడంలో కూడా ప్రభుత్వం జాప్యం చేస్తోందని పేర్కొన్నారు. పెన్షనర్ల నుంచి బేసిక్ పేలో 1.5 శాతం మినహాయిస్తున్నప్పటికీ, తగిన వైద్య సదుపాయాలు కల్పించడం లేదని అన్నారు.
పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి, పెండింగ్ బకాయిలు విడుదల చేయడంతో పాటు అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నాకు జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, నాయకుడు విజయరామరాజు కోరారు.
