రైతులు పండించిన పంటలను తక్షణమే కొనుగోలు చేయాలి..

బిక్కనూర్, ఆంధ్రప్రభ ; రైతులు పండించిన పంటలను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు శనివారం తాసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తడిసిన వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు .లారీల కొరత నివారించి సమస్య పరిష్కరించాలని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను బుజ్జగించిన ఫలితం లేకుండా పోయింది.

రైతుల సమస్యను జిల్లా అదనపు కలెక్టర్ గిరి దృష్టికి నాయకులు తీసుకెళ్లారు. తక్షణమే ఆయన స్పందించి తాసిల్దార్ సునీతతో ఫోన్లో మాట్లాడి 48 గంటల్లోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం శాంతించిన ఆందోళనకారులు తాసిల్దార్ సునీతకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply