ఎంఆర్పీఎస్ నూతన కమిటీల పునర్నిర్మాణానికి శ్రీకారం
దండేపల్లి, ఆంధ్రప్రభ: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పీఎస్ నూతన కమిటీల పునర్నిర్మాణ ప్రక్రియ చేపడుతున్నట్లు జిల్లా ఇన్చార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. గురువారం దండేపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంఆర్పీఎస్ 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. సామాజిక అసమానతల నిర్మూలనతో పాటు సమాన హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కార్యకర్తలందరూ ఆత్మగౌరవ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన ఆయన, జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేసి ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు విస్తరించనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో మంచిర్యాల నియోజకవర్గ ఇన్చార్జి చిప్పకుర్తి మల్లేష్, మండల ఇన్చార్జి తాగారు సత్యం, మల్లెల శ్రీనివాస్, ఆవుల శ్రీనివాస్, న్యాతం రమేష్, కొల్లూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
