టీడీపీ నాయకుల దాడులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే చర్యలు
ఎన్టీఆర్ జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
సత్యనారాయణపురం, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలు, యువతకు, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత ధర్నాపై టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరులు దాడికి పాల్పడడం అత్యంత దుర్మార్గమని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. రిలే నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలోని ధర్నా శిబిరాన్ని ధ్వంసం చేసి, కోడి గుడ్లు, టమాటాలతో దాడి చేయడం టీడీపీ గూండాయిజానికి నిదర్శనమన్నారు. అక్కడే ఉన్న పోలీసులు ఈ ఘటనను అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించడం అత్యంత విచారకరమని విమర్శించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు తమ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమయ్యారని అన్నారు.
ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధిని లక్ష్యంగా చేసుకుని కోడి గుడ్లతో దాడి చేయడం అత్యంత ఖండనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తగా వైస్సార్సీపీ రిలే దీక్షలు చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడ ఎక్కడ జరుగుతున్నాయో పోలీస్ కమిషనర్ కి, స్థానిక సీహెచ్ లకి పర్మిషన్ లు పంపించామని.. ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే హక్కును కూడా కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు.
డీఎస్సీ అభ్యర్థులు, యువత, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు సమాధానం చెప్పలేక టీడీపీ నాయకులు దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును హరించే ఇలాంటి చర్యలను ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు.వచ్చేది వైస్సార్సీపీనే ఏ ఒక్కరినీ వదిలే పరిస్థితి లేదు.టీడీపీ గుండాల దాడిని నిరసిస్తూ ధర్నా చౌక్ వద్ద రోడ్డుపై కూర్చొని సంఘీభావం తెలిపిన దేవినేని అవినాష్‌తో పాటు, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, ఎమ్.డి.రూహుల్లా,మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాడికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, శాంతియుత నిరసనలకు భద్రత కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

