డయాలసిస్ రోగులు ఇక్కట్లు

డయాలసిస్ రోగులు ఇక్కట్లు
మరో ఉద్దానంగా ఎ.కొండూరు
ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మరో ఉద్దానంగా పేరుగాంచిన ఎ.కొండూరు మండలంలోని గిరిజన తండాలు, గ్రామాల్లో కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అపోలో అనుబంధ మినీ డయాలసిస్ యూనిట్ ద్వారా సుమారు 27 మంది రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నారు.అయితే డయాలసిస్ నిర్వహించే ప్రతి సిట్టింగ్‌లో రోగుల్లో రక్తహీనత తగ్గే అవకాశం ఉంటుంది.ఈ నేపథ్యంలో రక్తహీనతను పెంచే అందుకు వైద్యుల సూచనల మేరకు ఐరన్ ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ డయాలసిస్ యూనిట్‌లో పనిచేస్తున్న ఇన్‌చార్జీలు రోగుల రక్తహీనత స్థితిని సరైన విధంగా పరీక్షించి, వైద్యుల ఆదేశాల మేరకు ఐరన్ ఇంజెక్షన్లు ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంజెక్షన్లు కూడా పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డయాలసిస్ యూనిట్‌లో మెడికల్ ఆఫీసర్‌ను నియమించి రోగుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాల్సి ఉండగా, ప్రస్తుతం డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో యూనిట్ ఇన్‌చార్జీలు తమతమ విధంగా రోగులను చూసుకుంటున్నారని సమాచారం.
గతంలో సీపీఎం, సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో డయాలసిస్ యూనిట్‌కు ప్రత్యేకంగా ఒక డాక్టర్‌ను నియమించాలని జిల్లా కలెక్టర్లకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించిన సందర్భాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా డాక్టర్‌ను నియమించాలని సూచించినప్పటికీ జిల్లా వైద్యశాఖ అధికారులు ఈ విషయంలో పట్టించుకోవడం లేదనే విమర్శలు ప్రజా సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. అదే విధంగా డయాలసిస్ యంత్రాల్లో ఉపయోగించే ఫిల్టర్లను కూడా సరైన సమయంలో మార్చడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై గురువారం గిరిజన విద్యావేత్త డాక్టర్ జ్యోతిలాల్ నాయక్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశాకు వ్యక్తిగత ఈమెయిల్ ద్వారా డయాలసిస్ రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించినట్లు ఆయన మీడియాకు తెలిపారు. గురువారం జిల్లాలో జరిగిన మెడికల్ విజిలెన్స్ తనిఖీ లలో భాగంగా ఎ.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న మినీ డయాలసిస్ కేంద్రాన్ని కూడా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు.ఐతే ఈ విషయం పై రాష్ట్ర మెడికల్ హెల్త్ విజిలెన్స్ అధికారి, బి. సి .కే నాయక్ , ప్రాథమిక వైద్యశాల డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ చేపించుకుంటున్న నలుగురు బాధితులకు తన ఫోన్ ద్వారా డయాలసిస్ ఎలా జరుగుతుందని ఆరా తీశారు.
ఈ విషయంలో ఇద్దరు డయాలసిస్ బాధితులు అంతా సక్రమంగా జరుగుతుందని చెప్పగా మరో ఇద్దరు మాత్రం డయాలసిస్ యూనిట్ లో డయాలసిస్ యంత్రంలో డయ లేజర్ మార్చకుండా డయాలసిస్ చేస్తున్నారని ఆయనకు చెప్పారు. యంత్రంలో డయ లేజర్ మార్చకపోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లకు గురి అయ్యి కోమా పాలు అవుతున్నామని కిడ్నీ రోగులు ఆయనకు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో ఒక సిట్టింగ్ డయాలసిస్ కి దయలేజర్ మారుస్తారని కానీ అపోలో సంస్థ వారు, పది సిట్టింగులకు కూడా డయ లేజర్ మార్చటం లేదని ఆయనకు చెప్పామని బాధితులు చెప్పారు.
డయాలసిస్ యూనిట్ లో పది శాతం కంటే ఎక్కువ హిమోగ్లోబిన్ ఉంటే వారానికి ఒకసారి ఇపిఓ ఇంజక్షన్ చేయాలని అలానే 6, 7 శాతం హిమోగ్లోబిన్ ఉంటే వారానికి రెండుసార్లు ఈపిఓ ఇంజక్షన్లు చేయవలసి ఉన్న సరిగ్గా చేయటం లేదని ఆయన దృష్టికి బాధితులు తీసుకువెళ్లారు.
అలానే డయాలసిస్ బాధితులకు బిపి మాత్రలు 10 ఎం జి వి మాత్రమే ఇస్తున్నారని 20 ఎం జి మాత్రలను ఇవ్వాలని అలానే డయాలసిస్ చేయించుకుంటున్న మాకు రక్తం ఎక్కించుకోవాలి అంటే విజయవాడ జిజిహెచ్ వరకు వెళ్లవలసిన పరిస్థితులు ఉన్నాయని రక్తం ఎక్కించే సౌకర్యాన్ని ప్రాథమిక వైద్యశాలలోనే ఉంచే విధంగా డయాలసిస్ యూనిట్ కు ప్రత్యేకంగా ఒక మెడికల్ ఆఫీసర్ ను కేటాయించాలని బాధితులు ఆయనకు తెలిపారు.
