యువతకు ఉపాధి, పెట్టుబడులకు అద్దంకి కేంద్రంగా మారనుంది
- మంత్రి గొట్టిపాటి రవికుమార్
అద్దంకి, ఆంధ్రప్రభ: అద్దంకి నియోజకవర్గంలో ఏర్పాటు కానున్న రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (REMZ) ప్రాజెక్టు కోసం భూములు అందించిన రైతులకు భూ పరిహార చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంతమాగులూరు, బల్లికురవ మండలాలకు చెందిన 37 మంది రైతులకు మొత్తం రూ.31.57 కోట్ల విలువైన భూ పరిహార చెక్కులను అందజేశారు.
ఈ ప్రాజెక్టు కోసం రైతులు మొత్తం 175.41 ఎకరాల భూమిని అందించగా, ప్రభుత్వం నిర్ణయించిన పరిహారాన్ని రైతులకు అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రతిష్ఠాత్మక REMZ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు అద్దంకి ప్రాంత ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని అన్నారు.
అలాగే, రామాయపట్నం పోర్టు, జాతీయ రహదారులకు సమీపంలో ఉండటం వల్ల అద్దంకి ప్రాంతం దేశీయ, అంతర్జాతీయ తయారీ సంస్థలకు అనుకూలమైన పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని, భారీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
రైతుల సహకారంతో ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతుందని, పారిశ్రామికీకరణ ద్వారా ప్రకాశం జిల్లా అభివృద్ధికి REMZ కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
