తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక

మధ్యాహ్నం నుంచి వానల మోత
హైదరాబాద్‌లో మరోసారి వర్షాలు
ఏడు జిల్లాలకు భారీ వర్ష సూచన

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సూచనలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలకు చెందిన జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశముందని అంచనా.

సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సిద్ధిపేట జిల్లాలతో పాటు సమీప ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్‌లో గత రెండు మూడు రోజుల మాదిరిగానే గురువారం కూడా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో వాహనదారులు, ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇతర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద నిలవకుండా, అవసరమైతేనే ప్రయాణాలు చేయాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు