డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళన

ఆర్డీవో కార్యాలయం ఎదుట నాలుగు రోజుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభం
సీబీఐ విచారణతో పాటు మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్

గుడివాడ, ఆంధ్రప్రభ: డీఎస్సీ నియామక ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుడివాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట గురువారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. పార్టీ నాయకులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ నిరసన కార్యక్రమాలు నాలుగు రోజుల పాటు కొనసాగనున్నాయి. డీఎస్సీ నియామకాల్లో నిబంధనలను పక్కనపెట్టి భారీ అక్రమాలు జరిగాయని, నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేసిందని వైసీపీ నేతలు ఆరోపించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు హామీలు ఇచ్చి ఇప్పుడు వారిని తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. సరైన అర్హతలు, నిబంధనలు పాటించకుండా, కనీసం పరీక్ష రాయని వారికి కూడా పోస్టులు కేటాయించారని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో జరిగిన డీఎస్సీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకత కోల్పోయిందని, నియామకాల్లో నిబంధనలకు తూట్లు పొడుస్తూ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని విమర్శించారు.

డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని మొత్తం వ్యవహారంపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిగి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

అలాగే విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, ఎంవీ నారాయణరెడ్డి, నందివాడ మండల అధ్యక్షుడు పేయ్యల ఆదాము, గుడివాడ రూరల్ ఎంపీపీ గద్దె పుష్పరాణి, మట్ట జాన్ విక్టర్, చిన్ని సత్య దుర్గాప్రసాద్, కందుల నాగరాజు, గుళ్లపూడి చంద్రశేఖర్‌తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, మహిళలు, కార్యకర్తలు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.