పెదకాకానిలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత..
పెదకాకానిలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత..
గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు ఆదివారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ నుంచి చిలకలూరిపేట వైపుగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న పౌర సరఫరాల శాఖ అధికారులు, పెదకాకాని మండలం నంబూరు జాతీయ రహదారి సమీపంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వస్తున్న వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా, అందులో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. సుమారు 30 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణాపై కేసు నమోదు చేశామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ (DT) దుర్గారావు తెలిపారు. ఈ దాడుల్లో దుర్గారావుతో పాటు పౌర సరఫరాల శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
