ఎస్‌ఆర్‌బీసీకి నీటి విడుదల.. రాయలసీమ రైతాంగానికి ఊరట..

పోతిరెడ్డిపాడు వద్ద 2 వేల క్యూసెక్కులు విడుదల చేసిన ఎస్‌ఈ శివశంకర్‌రెడ్డి


నందికొట్కూర్, ఆగస్టు 6, ఆంధ్రప్రభ : శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరడంతో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఇంజినీర్-ఇన్-చీఫ్ ఇరిగేషన్ ఓఎస్డీ డబ్ల్యూఆర్డీ వారి ఆదేశాల మేరకు గురువారం ఉదయం 9 గంటలకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ ఎస్‌ఆర్‌బీసీకి నీటిని విడుదల చేశారు. టీజీపీ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజినీర్, డీడబ్ల్యూఆర్వో పి.శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు కాలువ గేట్లకు పసుపు కుంకుమలు పూసి మామిడి తోరణాలు పూలమాలలతో అలంకరించి సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద మంత్రోచ్ఛారణల నడుమ కొబ్బరికాయలు కొట్టి పూలు పండ్లతో కృష్ణమ్మకు హారతి ఇచ్చి స్వాగతం పలికిన అనంతరం గేట్లు ఎత్తి 2000 క్యూసెక్కుల నీటిని కాలువలోకి విడుదల చేశారు.గేట్లు ఎత్తగానే కృష్ణా జలాలు ఉరకలెత్తి కాలువలోకి ప్రవహించాయి.ఈ నీటి విడుదలతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ఎస్‌ఆర్‌బీసీ ఆయకట్టు పరిధిలోని సుమారు 1.90 లక్షల ఎకరాలకు ఖరీఫ్ సాగునీరు అందనుంది. వర్షాభావ పరిస్థితులతో నారుమళ్లు ఎండిపోయి ఆందోళన చెందుతున్న రైతాంగానికి ఇది పెద్ద ఊరట కలిగించే అంశం. సకాలంలో నీరందడంతో వరి మిర్చి పత్తి శనగ వంటి పంటలు సాగుచేసే రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆయకట్టు గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా తీరనుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఎస్‌ఈ శివశంకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, రైతుకు ఎలాంటి కష్టం రాకుండా చూడటమే తమ ధ్యేయమన్నారు.ఆయకట్టు చివరి భూముల వరకు నీరందించేలా అన్ని చర్యలు తీసుకుంటామని రైతులు నీటిని సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.కార్యక్రమంలో ఈఈలు డీఈఈలు ఏఈలు సిబ్బందితో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.