tn chief minister | బ్యానర్లు, ఫ్లెక్సీలు కడితే కఠిన చర్యలు

tn chief minister | బ్యానర్లు, ఫ్లెక్సీలు కడితే కఠిన చర్యలు
tn chief minister | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల సంక్షేమమే పార్టీ లక్ష్యమని పేర్కొంటూ ప్రజలకు అసౌకర్యం కలిగించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.
పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి ఎన్.ఆనంద్ విడుదల చేసిన ప్రకటనలో నాయకుల పుట్టినరోజులు, కుటుంబ వేడుకల సందర్భంగా వీధులు, బహిరంగ ప్రదేశాల్లో బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని కార్యకర్తలకు సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలను పార్టీ ఏమాత్రం సహించబోదని టీవీకే హెచ్చరించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే సంబంధిత వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం విజయ్ నిర్ణయించినట్లు వెల్లడించింది. ప్రజలు పార్టీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించింది.
