పౌల్ట్రీ ఫార్మ్ ఎదుట గ్రామస్తుల నిరసన

దుర్వాసన, ఈగల సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్

చేగుంట, ఆంధ్రప్రభ: చేగుంట మండలం పెద్ద శివునూర్ గ్రామంలోని సీవీకే పౌల్ట్రీ ఫార్మ్ వల్ల గ్రామంలో దుర్వాసన, ఈగల సమస్య తీవ్రంగా పెరిగిందని ఆరోపిస్తూ గ్రామస్తులు గురువారం సర్పంచ్ నర్సింలు ఆధ్వర్యంలో పౌల్ట్రీ ఫార్మ్ ఎదుట నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు, సర్పంచ్ నర్సింలు మాట్లాడుతూ, గ్రామ శివారులో ఉన్న సీవీకే పౌల్ట్రీ ఫార్మ్ కారణంగా గ్రామమంతా దుర్వాసన వ్యాపిస్తోందని, ఈగల సంఖ్య కూడా అధికమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి నెలకొని పలువురు అనారోగ్యానికి గురయ్యారని ఆరోపించారు.

పౌల్ట్రీ ఫార్మ్ యాజమాన్యం వెంటనే దుర్వాసన, ఈగల నివారణకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఫార్మ్‌ను మూసివేయాలని డిమాండ్ చేశారు.

దాదాపు మూడు గంటల పాటు గ్రామస్తులు నిరసన కొనసాగించారు. అయితే పౌల్ట్రీ ఫార్మ్ నిర్వాహకులు అక్కడ అందుబాటులో లేకపోవడంతో, రెండు రోజుల తర్వాత గ్రామస్తులతో సమావేశమై సమస్యపై చర్చిస్తామని ప్రతినిధుల ద్వారా హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ మల్లేశం, నాయకులు సురేందర్, అప్పాల శేఖర్, ప్రశాంత్, నాగరాజు, శ్రీనివాస్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.