పులి జాడ కోసం హైటెక్ ఆపరేషన్
350 మంది బృందాలతో అటవీ శాఖ కూంబింగ్
ఏలూరు, ఆంధ్రప్రభ: ఏలూరు జిల్లాలో సంచరిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు అటవీ శాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల బృందాలతో భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. పులి కదలికలను క్షణక్షణం పర్యవేక్షిస్తూ, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా అటవీ శాఖాధికారి పి.వి. సందీప్ రెడ్డి తెలిపారు.
అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహారాష్ట్రలోని వార్ధా, పుణే ప్రాంతాల నుంచి నిపుణుల బృందాలు, బెంగళూరుకు చెందిన వైల్డ్‌లైఫ్ SOS, వార్ధాకు చెందిన పీపుల్ ఫర్ యానిమల్స్ సంస్థలతో పాటు వివిధ టైగర్ రిజర్వుల నుంచి అనుభవజ్ఞులైన సిబ్బందిని రంగంలోకి దించారు. మత్తుమందు తుపాకీలతో పులిని సురక్షితంగా బంధించగల ఆరుగురు ప్రత్యేక ట్రాంక్విలైజింగ్ షూటర్లను సిద్ధంగా ఉంచారు.
రాజమండ్రి అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ డా. టి. జ్యోతి, జిల్లా అటవీ శాఖాధికారి పి.వి. సందీప్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. పులి అత్యంత చురుకుగా, అప్రమత్తంగా వ్యవహరిస్తూ మానవ సంచారం ఉన్న ప్రాంతాలను గమనిస్తూ తప్పించుకుంటున్నప్పటికీ, నిపుణుల బృందాలు వ్యూహాత్మకంగా గాలింపును కొనసాగిస్తున్నాయి.
పాదముద్రలు, కెమెరా ట్రాప్ చిత్రాలు, థర్మల్ డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు, వి హెచ్ ఎఫ్ కమ్యూనికేషన్ వ్యవస్థలను వినియోగిస్తూ పులి కదలికలను గుర్తిస్తున్నారు. ఇన్నర్, ఔటర్ జోన్లుగా ప్రాంతాన్ని విభజించి, ఎరలను ఏర్పాటు చేసి పులిని నిర్దిష్ట ప్రాంతానికి ఆకర్షించే ప్రణాళికను అమలు చేస్తున్నారు.
ఈ ఆపరేషన్‌లో టెరిటోరియల్, వైల్డ్‌లైఫ్ విభాగాలకు చెందిన సిబ్బంది, వెటర్నరీ వైద్యులు, స్థానిక గ్రామస్తులతో కలిపి 350 మందికి పైగా రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. దర్భగూడెం, పి. రాజవరం, చెల్లావారిగూడెం, ఎ. పోలవరం, అప్పలరాజుగూడెం, సిరివారిగూడెం, రామన్నపాలెం, మడకవారిగూడెం, దాట్లవారిగూడెం, శ్రీరత్నగూడెం, సీతాంపేట తదితర గ్రామాల్లో డప్పు చాటింపులు, మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అటవీ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ సహకరించాలని జిల్లా అటవీ శాఖాధికారి పి.వి. సందీప్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
