సైబర్ నేరాల కట్టడికి అప్రమత్తతే ఆయుధం
- అవగాహన పెంచుకుంటేనే మోసాలకు చెక్ : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ఖమ్మం, ఆంధ్రప్రభ : సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటంతో పాటు అవగాహన పెంచుకోవడం అత్యంత అవసరమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. సైబర్ జాగృతి దివస్‌లో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ‘సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
డిజిటల్ యుగంలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్లు, ఆన్‌లైన్ కొనుగోళ్లు, సోషల్ మీడియా వినియోగం పెరగడంతో సైబర్ నేరాలకు అవకాశాలు కూడా విస్తరించాయని ఆయన తెలిపారు. ప్రజల డబ్బు, వ్యక్తిగత సమాచారం, గోప్యతను లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, యూపీఐ పిన్, సీవీవీ నంబర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. తెలియని లింక్‌లపై క్లిక్ చేయకూడదని, ప్రతి ఖాతాకు వేర్వేరు బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించాలని, రెండు దశల భద్రత (టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్) తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపారు. బ్యాంకు లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే కాల్ నిలిపివేసి సంబంధిత సంస్థ అధికారిక నంబర్లకే సంప్రదించాలని సూచించారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త మోసాలు
కృత్రిమ మేధస్సు (ఏఐ), నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ యాప్‌లు, ఉద్యోగాలు, పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు, క్యూఆర్ కోడ్ స్కామ్‌లు ఇటీవల వేగంగా పెరిగాయని సునీల్ దత్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు లేదా పోలీసుల పేర్లు చెప్పి వీడియో కాల్స్ ద్వారా భయపెట్టి లక్షల రూపాయలు దోచుకుంటున్న ఘటనలు నమోదవుతున్నాయని చెప్పారు.
వందల ఫిర్యాదులు.. లక్షల్లో నష్టం
ప్రతి నెల వందల సంఖ్యలో సైబర్ మోసాల ఫిర్యాదులు నమోదవుతున్నాయని, అత్యంత చదువుకున్నవారు కూడా నేరగాళ్ల మానసిక వ్యూహాలకు మోసపోతున్నారని పేర్కొన్నారు. ఒకసారి బ్యాంకు వివరాలు లేదా ఓటీపీ నేరగాళ్ల చేతికి చేరితే కొద్ది నిమిషాల్లోనే ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి
ఆన్‌లైన్ మోసం లేదా ఆర్థిక సైబర్ నేరానికి గురైన వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ హెల్ప్‌లైన్ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్, ఇన్‌స్పెక్టర్లు కరుణాకర్, బాలకృష్ణ, మోహన్‌బాబు, భానుప్రకాష్, ఉస్మాన్ షరఫ్, ఎస్సైలు రంజిత్ కుమార్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
