దిగొచ్చిన మెటా..!

  • కేంద్రం ముందు వివరణ..
  • ప్రధాని పోస్టు తొలగింపుపై 45 నిమిషాల చర్చ
  • మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్‌బుక్ పోస్టు తాత్కాలికంగా తొలగించిన వ్యవహారం మెటాకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేయడంతో మెటా గ్లోబల్ బృందం బుధవారం కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ (మెయిటీ) ఉన్నతాధికారులతో సమావేశమైంది. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

మెటా గ్లోబల్ వ్యవహారాల అధికారి జోయెల్ కాప్లన్ నేతృత్వంలోని బృందం ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్‌తో సమావేశమైంది. అలాగే కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కూడా మెటా బృందం కలిసింది.

ప్రధాని పోస్టు తొలగింపుపై కేంద్రం అసంతృప్తి

జూలై 23న ప్రధాని నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన వీడియోను ఫేస్‌బుక్ కొంతసేపు పరిమితం చేసింది. అనంతరం అది సాంకేతిక లోపం వల్ల జరిగిందని మెటా వివరణ ఇచ్చి పోస్టును పునరుద్ధరించింది. అయితే ఈ వివరణను కేంద్ర ప్రభుత్వం సరిపోదని స్పష్టం చేసింది.

సమావేశంలో ప్రధాని పోస్టు వ్యవహారంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో పిల్లలపై లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్, ప్రకటనలు, కృత్రిమ మేధతో రూపొందించిన తప్పుడు సమాచార నియంత్రణ వంటి అంశాలపై కూడా కేంద్రం ప్రశ్నలు సంధించింది. ప్రముఖ వ్యక్తుల ధృవీకరించిన ఖాతాల్లోని పోస్టులను తొలగించే ముందు మరింత భద్రతా వ్యవస్థ ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

అల్గోరిథమ్‌పై వివరణ కోరిన ప్రభుత్వం

మెటా అల్గోరిథమ్ ఎలా పనిచేస్తోంది? పోస్టులు ఏ ప్రాతిపదికన తొలగించబడుతున్నాయి? భారత చట్టాలకు అనుగుణంగా వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వంటి అంశాలపై కూడా ప్రభుత్వం వివరణ కోరింది. దేశ భద్రత, ప్రజా శాంతి వంటి అంశాలకు సంబంధించిన విషయాల్లో సోషల్ మీడియా వేదికలు అత్యంత బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేసింది.

ఇదిలా ఉండగా, ప్రధాని మోదీ వీడియో తొలగింపును తీవ్రంగా పరిగణించిన పార్లమెంటరీ స్థాయి సంఘం మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ మూడు రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. నిర్దేశిత గడువులో స్పందించకపోతే భారతదేశంలో మెటాకు లభిస్తున్న ‘సేఫ్ హార్బర్’ రక్షణను పునఃపరిశీలించే అవకాశం ఉందని హెచ్చరించింది.

భారత్ చట్టాలు తప్పనిసరిగా పాటించాలి

సోషల్ మీడియా సంస్థలు భారత చట్టాలను పూర్తిగా పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతో పాటు, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మెటా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం.