అద్దంకిలో రూ.31.57 కోట్ల పరిహారం పంపిణీ

  • రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌కు భూసేకరణ
  • 37 మంది రైతులకు రూ.31.57 కోట్ల పరిహార చెక్కుల పంపిణీ

అద్దంకి, ఆంధ్రప్రభ: అద్దంకి నియోజకవర్గంలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు కానున్న రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (ఆర్‌ఈఎమ్‌జెడ్‌) కోసం భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భూములు అందించిన 37 మంది రైతులకు రూ.31.57 కోట్ల పరిహారాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. అద్దంకి రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రైతులకు పరిహార చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం 175.41 ఎకరాల భూములను రైతులు స్వచ్ఛందంగా అందించడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పరిశ్రమల స్థాపనకు వేగం పెంచుతున్నట్లు తెలిపారు.

అద్దంకి ప్రాంతం రామాయపట్నం పోర్టు, జాతీయ రహదారులకు సమీపంలో ఉండటంతో వ్యూహాత్మకంగా ఎంతో అనుకూలమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు కానున్న రెన్యూవబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి పునరుత్పాదక ఇంధన తయారీ సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ఆకర్షణీయ కేంద్రంగా మారే అవకాశముందని చెప్పారు.

ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని భూములు అందించిన సంతమాగులూరు, బల్లికురవ మండలాల రైతులకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అద్దంకి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు విశిష్ట గుర్తింపును తీసుకురావడంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.