తాగి వాహనం నడపొద్దు : ఎస్ఐ
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ : మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని కమ్మర్పల్లి ఎస్ఐ సీహెచ్. సతీష్ వాహనదారులను హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణాల రక్షణే లక్ష్యంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి, వారిని ఆర్మూర్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు తెలిపారు. ఉప్లూర్కు చెందిన పసేపు తిరుపతికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష, దుబ్బక ముత్తాగౌడ్కు పది రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్ఐ వివరించారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కేవలం వాహనదారుల ప్రాణాలకే కాకుండా రోడ్డుపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకూ ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. రానున్న రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ సీహెచ్. సతీష్ స్పష్టం చేశారు.
