Union Minister | రూ.7,823 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
Union Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మే 10న హైదరాబాద్ పర్యటనకు వచ్చే ప్రధాని నరేంద్ర మోడీ రూ.7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి, హైదరాబాద్‌లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించిన టెర్మినల్‌ను ప్రధాని ప్రారంభిస్తారని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో రూ.3,175 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు వర్చువల్‌గా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
హఫీజ్‌పేట, జోగులాంబ రైల్వే స్టేషన్లను, కాజీపేట-విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్‌ను కూడా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.85వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు. హైదరాబాద్-యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్ ఉత్పత్తులను ఎగుమతి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు.
