ఒకనాటి మధురానుభూతి.. నేడు చెదిరిన కల..!

  • విరిగిపోయిన వాకింగ్ ట్రాక్..
  • ధ్వంసమైన ఆట పరికరాలు..
  • కనుమరుగైన గాంధీ విగ్రహం..
  • మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో పూర్వ వైభవం కోల్పోయిన చారిత్రక పార్క్
  • ఒకప్పుడు పట్టణ ప్రజల విశ్రాంతి కేంద్రం…
  • నేడు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: పట్టణంలోని కేబీ రోడ్డులో ఉన్న గాంధీ పార్క్ ఒకప్పుడు పట్టణ ప్రజల విశ్రాంతి, వినోదానికి చిరునామాగా నిలిచేది. పచ్చని చెట్లు, పరిశుభ్రమైన వాతావరణం, అందమైన వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట పరికరాలు, వాటర్ ఫౌంటెన్, బెంచీలు, ఉదయం–సాయంత్రం సందడిగా కనిపించే సందర్శకులతో ఈ పార్క్ కళకళలాడేది. పార్కు ప్రవేశ భాగంలో ఆంధ్రప్రభతో పాటు ఇతర ప్రముఖ దినపత్రికలు అందుబాటులో ఉండటంతో చాలామంది అక్కడే వార్తలు చదువుతూ పరిచయస్తులతో ముచ్చటించేవారు. ఉదయం వాకింగ్‌కు వచ్చే వృద్ధులు, మహిళలు, యువత, సాయంత్రం ఆటలతో సందడి చేసే చిన్నారులతో గాంధీ పార్క్ పట్టణ హృదయంగా వెలుగొందేది.

సైరన్ మోగితే సమయమే తెలిసేది

పార్కులోని చెట్లను అప్పటి వాచ్‌మన్ ఎంతో శ్రద్ధగా సంరక్షిస్తూ ఉద్యానవనాన్ని తలపించేలా తీర్చిదిద్దేవారని స్థానికులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. అంతేకాకుండా పార్కులో ఏర్పాటు చేసిన భారీ సైరన్ ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, రాత్రి 8 గంటలకు మ్రోగి పట్టణ ప్రజలకు సమయాన్ని తెలియజేసేది. సైరన్ శబ్దం కిలోమీటర్ల దూరం వరకు వినిపించడంతో ప్రజలు తమ దైనందిన కార్యక్రమాలను సర్దుబాటు చేసుకునేవారు.

అలాగే పార్కులోని నాగేంద్రస్వామి పుట్టకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉండేది. అక్కడ పాలు పోసి పూజలు చేయడం, పిల్లలకు చెవులు కుట్టించడం, అన్నప్రాసన వంటి శుభకార్యాలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. అనాథలు, నిరుపేదలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు కూడా రాత్రి వేళల్లో ఈ పార్కులోనే ఆశ్రయం పొందేవారు.

నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరిన పార్క్

అయితే కాలగమనంలో గాంధీ పార్క్ పూర్తిగా తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ప్రస్తుతం పార్కు ప్రవేశ ద్వారం వద్ద ‘గాంధీ పార్క్’ అనే పేరు కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు ఉన్న గాంధీ విగ్రహం అదృశ్యమైంది. పట్టణానికి సమయాన్ని తెలిపిన సైరన్ మూగబోయింది. వాకింగ్ ట్రాక్ పూర్తిగా శిథిలమై నడవడానికి అనువుగా లేకుండా పోయింది. పిల్లల ఆట పరికరాలు విరిగిపోయి ప్రమాదకరంగా మారాయి. వాటర్ ఫౌంటెన్ నిర్వహణ లేక నిరుపయోగంగా ఉంది. బెంచీలు ధ్వంసమై కూర్చోవడానికి వీలులేని స్థితికి చేరుకున్నాయి. పార్కు ప్రాంగణంలోని కొంత భాగం శానిటరీ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంగా మారిపోవడంతో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన స్థలం క్రమంగా తగ్గిపోయింది.

జ్ఞాపకాలే మిగిల్చిన గాంధీ పార్క్

ఒకప్పుడు ఈ పార్కులో బాల్యాన్ని గడిపిన వారు నేడు అక్కడి పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మన చిన్ననాటి జ్ఞాపకాలను మోసిన గాంధీ పార్క్ ఇదేనా?” అంటూ వృద్ధులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పట్టణానికి గుర్తింపుగా నిలిచిన ఈ చారిత్రక పార్క్ ఇంత దుస్థితికి చేరుకోవడం పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు.

పునరుద్ధరణ కోసం ప్రజల ఎదురుచూపు

గాంధీ పార్కును తిరిగి పూర్వ వైభవానికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అందులో భాగంగా ఆకర్షణీయమైన నేమ్ బోర్డు ఏర్పాటు చేయడం, గాంధీ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం, ఆధునిక వాకింగ్ ట్రాక్ నిర్మించడం, కొత్త ఆట పరికరాలు ఏర్పాటు చేయడం, వాటర్ ఫౌంటెన్‌ను పునరుద్ధరించడం, బెంచీలు, ఎల్‌ఈడీ లైటింగ్, తాగునీటి సౌకర్యం కల్పించడం, పచ్చదనాన్ని పెంచడం, పార్కు నిర్వహణకు ప్రత్యేక సిబ్బందిని నియమించడం వంటి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అమృత్ పథకంతో కొత్త ఆశలు

ఈ విషయమై మున్సిపల్ డీఈఈ షేక్ అబ్దుల్ రహీం స్పందిస్తూ, అమృత్ పథకం కింద గాంధీ పార్కును ఆధునీకరించే ప్రతిపాదన ఉందని, త్వరలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న గాంధీ పార్కును తిరిగి అందంగా తీర్చిదిద్ది ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా మార్చితే పట్టణానికి ఒకప్పుడు ఉన్న గుర్తింపు తిరిగి వస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చారిత్రక పార్కును పరిరక్షించడం మున్సిపల్ యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరి బాధ్యత అని వారు స్పష్టం చేస్తున్నారు.