పులి కోసం రంగంలోకి నిపుణుల ప్రత్యేక బృందాలు
- చాకచక్యంగా తప్పించుకుంటున్న పులి.. అధికారులకు సవాల్
- డ్రోన్లు, ట్రాకింగ్‌తో క్షణక్షణం నిఘా
- గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరిక
ఏలూరు, ఆంధ్రప్రభ: ఏలూరు – రాజమండ్రి – కాకినాడ – చింతూరు – పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతాలలో సంచరిస్తున్న పులిని సురక్షితంగాబంధించేందుకు అటవీ శాఖ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే మహారాష్ట్ర (వార్ధా, పుణే) బృందాలతో పాటు, బెంగళూరు నుండి ‘వైల్డ్‌లైఫ్ SOS’ నిపుణుల బృందాన్ని, వార్ధా నుండి ‘పీపుల్ ఫర్ యానిమల్స్’ బృందాన్ని, అలాగే వివిధ టైగర్ రిజర్వ్‌ల నుండి అనుభవజ్ఞులైన ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించారు. మత్తుమందు తుపాకీలతో పులిని బంధించడంలో నైపుణ్యం ఉన్న ఆరుగురు ట్రాంక్విలైజింగ్ షూటర్లను సిద్ధంగా ఉంచారు.
అధికారుల పరిశీలన పులి ప్రవర్తన…
ఈ పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు ఏలూరు జిల్లా అటవీ శాఖాధికారి పి.వి. సందీప్ రెడ్డి, క్షేత్రస్థాయిలో పర్యటించి ఆపరేషన్‌ను పరిశీలించారు.
పులి చాలా చురుగ్గా, చాకచక్యంగా ప్రవర్తిస్తోంది. మానవ సంచారం ఉన్న ప్రాంతాలను, చివరకు ప్రత్యేకంగా అమర్చిన మంచెలను కూడా చాలా తెలివిగా గమనిస్తూ, మనుషులు ఉండే ప్రదేశాలను తప్పించుకుంటూ ప్రయాణిస్తోంది. అయినప్పటికీ, నిపుణుల బృందాలు పక్కా వ్యూహంతో పులిని క్షేమంగా బంధించడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయని సందీప్ రెడ్డి వివరించారు
ప్రజలకు హెచ్చరికలు అప్రమత్తత….
ప్రతిరోజూ పులి సంచారాన్ని నిరంతరం ట్రాక్ చేస్తూ దర్భగూడెం, పి.రాజవరం, చెల్లావారిగూడెం, ఎ.పోలవరం, అప్పలరాజుగూడెం, సిరివారిగూడెం, రామన్నపాలెం, మడకవారిగూడెం,దాట్లవారిగూడెం, శ్రీరత్నగూడెం సీతాంపేట, సమీప గ్రామాల ప్రజలను డప్పు చాటింపులు, మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా అప్రమత్తం చేస్తున్నారు.
కన్నాపూర్, పోలవరం, కుకునూరు, జంగారెడ్డిగూడెం ఫారెస్ట్ రేంజ్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పూర్తి అప్రమత్తతతో ఉన్నారు. ప్రజలు కూడా భయాందోళన చెందకుండా అటవీ శాఖ సూచనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరుతున్నారు.
