TechToK | ఇలా చేస్తే మీ వాట్సాప్ అకౌంట్ బ్లాక్..!

  • ఈ తప్పులు అస్సలు చేయొద్దు

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న వాట్సాప్‌లో నిబంధనలు ఉల్లంఘిస్తే మీ అకౌంట్ తాత్కాలికంగా ‘అండర్ రివ్యూ’లోకి వెళ్లే అవకాశం ఉంది. అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినప్పుడు మెటా 24 గంటల వరకు అకౌంట్‌ను బ్లాక్ చేయవచ్చు. ఈ సమయంలో కొన్ని ఫీచర్ల వినియోగంపై కూడా పరిమితులు ఉండే అవకాశం ఉంది.

చట్టవిరుద్ధమైన, ద్వేషపూరిత, హింసను ప్రేరేపించే లేదా అశ్లీల కంటెంట్‌ను షేర్ చేయడం, అధికారిక వాట్సాప్‌కు బదులుగా జీబీ వాట్సాప్ (GB WhatsApp), ఎఫ్‌ఎం వాట్సాప్ (FM WhatsApp) వంటి అనధికారిక మాడిఫైడ్ యాప్‌లను ఉపయోగించడం, ఒకే సందేశాన్ని తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో వ్యక్తులకు లేదా గ్రూపులకు వరుసగా పంపడం వంటి చర్యలను మెటా స్పామ్ లేదా నిబంధనల ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంది.

అలాగే మీ ఫోన్ నంబర్‌ను ఎక్కువ మంది బ్లాక్ చేయడం లేదా రిపోర్ట్ చేయడం, ఒక్కసారిగా అసాధారణ స్థాయిలో సందేశాలు పంపడం లేదా స్వీకరించడం వంటి అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించినా అకౌంట్‌ను సమీక్ష (అండర్ రివ్యూ) కోసం నిలిపివేయవచ్చు.

అందువల్ల అధికారిక వాట్సాప్ యాప్‌ను మాత్రమే ఉపయోగించడం, నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్‌ను షేర్ చేయకుండా ఉండటం, స్పామ్ తరహా సందేశాలు పంపకపోవడం, అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండటం ద్వారా అకౌంట్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.