అభివృద్ధే లక్ష్యం, సంక్షేమమే ధ్యేయం
నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య
13వ వార్డులో రూ.7.50 లక్షలతో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నందికొట్కూరు మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. పట్టణంలోని 13వ వార్డులో రూ.7.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్యే గిత్త జయసూర్య భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి వార్డులో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను గుర్తించి యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడి ఇంటికి చేరేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి నగదు జమ వరకు ప్రతి దశను పారదర్శకంగా పర్యవేక్షిస్తున్నామని, అవినీతికి ఎలాంటి అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
నందికొట్కూరు పట్టణంలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, వీధి దీపాల వంటి మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. 13వ వార్డులో సీసీ రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా వర్షాకాలంలో బురదతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని అన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామని, నెల రోజుల్లో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో దశలవారీగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. అభివృద్ధే తమ లక్ష్యమని, ప్రజల సంక్షేమమే ధ్యేయమని పేర్కొంటూ నందికొట్కూరు పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని గిత్త జయసూర్య అన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి పట్టణ అధ్యక్షుడు, 13వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు, ఏఈ, వార్డు సచివాలయ సిబ్బంది, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చొరవతో వార్డుకు సీసీ రోడ్డు మంజూరు కావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
