ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు పెరిగిన చేరికలు.
జిల్లావ్యాప్తంగా సత్ఫలితాలు.
పెద్దపల్లి(ఆంధ్రప్రభ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచే లక్ష్యంతో చేపట్టిన బడిబాట కార్యక్రమం పెద్దపల్లి జిల్లాలో ఆశించిన ఫలితాలను ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెరగడంతో ఈ విద్యాసంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా గణనీయ సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారు. అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోనే ప్రవేశాలు పొందడం బడిబాట కార్యక్రమం విజయానికి నిదర్శనంగా నిలిచింది.
జిల్లాలో అత్యధికంగా పెద్దపల్లి మండలంలోనే చేరికలు నమోదయ్యాయి. ఈ మండలంలో సుమారు 500 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, మరో వెయ్యి మంది వరకు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రవేశాలు పొందినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. బడిబాట కార్యక్రమంలో రామగుండం మండలం కూడా విశేష ఫలితాలు సాధించింది.
పెద్దపల్లి తర్వాత అత్యధిక చేరికలు ఈ మండలంలో నమోదయ్యాయి. మిగిలిన మండలాల్లోనూ ఒక్కో చోట సుమారు 150 నుంచి 200 మంది విద్యార్థులు బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ బోధన వంటి సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వల్ల చేరికలు పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
మొత్తంగా ఈ ఏడాది నిర్వహించిన బడిబాట కార్యక్రమం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దోహదపడిందని, ఆశించిన లక్ష్యాన్ని చేరుకుందని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పాఠశాలలో సౌకర్యాలు మరింత మెరుగుపరిచి విద్యార్థుల సంఖ్యను ఇంకా పెంచితే ప్రభుత్వ బడులు విద్యార్థులతో కార్పోరేట్ స్థాయిలో ముందుకు సాగడం ఖాయమంటున్నారు విద్యావేత్తలు.
