ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బాధ్యతగా వ్యవహరించాలి

మెండోర, ఆంధ్రప్రభ: బాల్కొండ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే ప్రజా సమస్యల పరిష్కారానికి బాధ్యతగా వ్యవహరించాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సూచించారు. మంగళవారం మెండోర మండల కేంద్రంలోని డబుల్ బెడ్‌రూమ్ గృహ సముదాయాన్ని ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2017 మేలో ప్రారంభమైన డబుల్ బెడ్‌రూమ్ గృహ నిర్మాణ పనులు ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనూ, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలోనూ పూర్తికాలేదని విమర్శించారు. గృహ సముదాయానికి కనీస రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు కూడా కల్పించలేదని ఆరోపించారు. ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తుంటే వాటిపై ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం అభివృద్ధి పనులు, నిధుల విషయంలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి బాల్కొండ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.