విద్య, వైద్య రంగాలకు పెద్దపీట..

  • ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించాలి…

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. వివిధ అనారోగ్య సమస్యలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్య సిబ్బంది మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావుతో కలిసి మంత్రి సీతక్క నూతన సదరం శిబిరం, యూడీఐడీ భవనం, ఆక్సిజన్ ప్లాంట్‌తో పాటు ఆర్థో, గైనిక్, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ విభాగాలకు సంబంధించిన నాలుగు ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో పూర్తిస్థాయిలో వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లా కేంద్రంలో ప్రత్యేక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. జిల్లా ఆస్పత్రి ప్రస్తుత భవనం ఇరుకుగా ఉన్న నేపథ్యంలో మరో ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

గతంతో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడటం సంతోషకరమైన విషయమని, ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను మంత్రి పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహిన్, జిల్లా ఆస్పత్రి వైద్యాధికారి చంద్రశేఖర్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.