విజయవాడలో భారీ చోరీ కేసు ఛేదించిన వన్‌టౌన్ పోలీసులు
- 60 లక్షల చోరీ కేసును ఛేదించిన విజయవాడ వన్‌టౌన్ పోలీసులు
- ముగ్గురు నిందితుల అరెస్ట్.. మరో ఇద్దరి కోసం గాలింపు..
- రూ.50 లక్షల విలువైన నగదు, బంగారం, వెండి స్వాధీనం..
విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ: విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. శాస్త్రీయ దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
పోలీసుల విచారణలో షాపులో పనిచేసిన ఉద్యోగులే యజమాని నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ముందస్తు ప్రణాళికతో చోరీకి పాల్పడినట్లు తేలింది. నిందితులు చోరీ చేసిన సొత్తును వివిధ ప్రాంతాలకు తరలించి దాచిపెట్టేందుకు ప్రయత్నించినప్పటికీ, పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి రూ.14.35 లక్షల నగదు, 302 గ్రాముల బంగారం, 685 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షలుగా అంచనా వేస్తున్నారు. మొత్తం చోరీ సొత్తు విలువ సుమారు రూ.60 లక్షలు ఉండగా, ఇంకా కొంత సొత్తు స్వాధీనం చేసుకోవాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఈ కేసును వెస్ట్ జోన్ డీసీపీ గుణ్ణం రామకృష్ణ, వెస్ట్ డివిజన్ ఏసీపీ ఎన్.ఎస్.వి.కే. దుర్గారావు పర్యవేక్షణలో వన్‌టౌన్ పోలీసులు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు అభినందించారు.
