లబ్ధిదారుల ముంగిటకే ఎన్టీఆర్ భరోసా..

  • 2.33 లక్షల మందికి రూ.102.90 కోట్ల పెన్షన్లు
  • తొలిరోజే పూర్తి చేయాలి.. అధికారులకు కలెక్టర్ ఆదేశం
  • పెన్షన్ పంపిణీపై స్వయంగా ఆరా తీసిన కలెక్టర్
  • ఇంటింటికీ సంక్షేమం.. కర్నూలులో ఎన్టీఆర్ భరోసా పంపిణీ

కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ : లబ్ధిదారుల ఇంటి ముంగిటకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందజేస్తూ జిల్లాలో ఆగస్టు నెలకు సంబంధించి 2 లక్షల 33 వేల 902 మంది లబ్ధిదారులకు రూ.102.90 కోట్ల సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి తెలిపారు.

శనివారం నగరంలోని బుధవారపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, నాగవీరమ్మ, జయలక్ష్మి, భాగ్యలక్ష్మిలకు వితంతు పెన్షన్లు, వరలక్ష్మి, మద్దమ్మలకు వృద్ధాప్య పెన్షన్లు, మధుకు వైకల్య పెన్షన్‌ను స్వయంగా అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆత్మీయంగా మాట్లాడిన కలెక్టర్, ఇంట్లో వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు బాగా చూసుకుంటున్నారా, ఏవైనా సమస్యలు ఉన్నాయా, ప్రతి నెలా పెన్షన్ సకాలంలో అందుతోందా అని ఆరా తీశారు. అలాగే పెన్షన్ పంపిణీ సమయంలో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నారా, పంపిణీ చేసే అధికారుల ప్రవర్తన ఎలా ఉందని లబ్ధిదారులను ప్రశ్నించి వివరాలు సేకరించారు.

పెన్షన్ పంపిణీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్, తొలి రోజే 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని, అనివార్య కారణాలతో మిగిలిన వాటిని రెండో రోజు కల్లా పూర్తిచేయాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్కు సూచించారు.

సామాజిక భద్రతా పెన్షన్లు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దకే అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.