మూతపడిన ఉన్సా పల్లె దవాఖాన..

వైద్య సేవల కోసం ప్రజల అవస్థలు

వైద్య సిబ్బందిని నియమించి సేవలు పునరుద్ధరించాలని గ్రామస్తుల డిమాండ్

బోధన్ రూరల్, ఆంధ్రప్రభ : బోధన్ మండలంలోని ఉన్సా గ్రామ పల్లె దవాఖాన గత కొంతకాలంగా మూతపడడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్థులకు అందుబాటులో ఉండాల్సిన ప్రాథమిక వైద్య సేవలు నిలిచిపోవడంతో చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా సమీప పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పల్లె దవాఖానలో వైద్య సిబ్బంది లేకపోవడం, తలుపులు ఎప్పుడూ మూసి ఉండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు అత్యవసర వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె దవాఖాన ప్రజలకు ఉపయోగపడకుండా ఉండటం బాధాకరమని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వైద్యాధికారి, అవసరమైన సిబ్బందిని నియమించి పల్లె దవాఖానను తిరిగి ప్రారంభించి, గ్రామ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.